పంచాయతీ పదనిసలు
ఒక్క ఓటుతో వరించిన విజయం
తిరుమలగిరి(తుంగతుర్తి) : తిరుమలగిరి మండలం మర్రికుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన గుగులోత్ రోజా ఒక్క ఓటు తేడాతో తన సమీప ప్రత్యర్థి ధరవత్ కల్పనపై విజయం సాధించింది. ఈ గ్రామంలో 885 ఓట్లకు గాను 836 ఓట్లు పోలయ్యాయి. 2 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 838 ఓట్లు పోలవ్వగా.. 7 ఓట్లు చెల్లలేదు. ఇందులో రోజాకు 416 ఓట్లు రాగా.. కల్పనకు 415 ఓట్లు వచ్చాయి.
చిన్ననారాయణపురంలోనూ ఒక్క ఓటుతోనే..
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి మేరుగు అనిత ఒక ఓటు తేడాతో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి జెంగిలి అనితపై గెలుపొందింది. గ్రామంలో మొత్తం 525 ఓట్ల ఉండగా.. 517 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి రీ కౌంటింగ్ నిర్వహించారు. ఈ రీకౌంటింగ్‌లో జెంగిలి అనితకు 2 ఓట్లు, మేరుగు అనితకు ఒక ఓటు చెల్లనివి వచ్చాయి. దీంతో ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మేరుగు అనిత విజయం సాధించారు. ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో గ్రామలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. కాంగ్రెస్ నాయకుడు నడింపల్లి లింగయ్య కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని లాఠీచార్జీ చేశారు.
నిమిషం నిబంధనతో ఓటుకు దూరం
ఆత్మకూర్(ఎస్)(సూర్యాపేట) : ఒక్క నిమిషం నిబంధనతో పలువురు ఓట్లకు దూరమయ్యారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో ఓటు వేసేందుకు గ్రామానికి చెందిన వారు హైదరాబాద్ నుంచి ఒంటిగంట రెండు నిమిషాలకు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కాగా, అప్పటికే గేట్లు బంద్ చేయడంతో వారిని లోపలికి వెళ్లడానికి పోలీసు అధికారులు నిరాకరించారు. దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు. ఎంతో ప్రయాసపడి హైదరాబాద్ నుంచి వచ్చామని, ట్రాఫిక్ సమస్యతో సమయానికి చేరుకోలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటేసి ఇంటికి వెళ్తూ మృతి
గట్టుప్పల్: ఓటేసి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గట్టుప్పల్ మండల కేంద్రంలో గురువారం జరిగింది. గట్టుప్పల్‌కు చెందిన చెరుపల్లి బుచ్చయ్య(68) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కాగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అతడిని కుటుంబ సభ్యులు కారులో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఉదయం 11.30 గంటల సమయంలో బూత్‌లో ఓటు వేశాడు. అనంతరం కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకెళ్తుండగా మృతిచెందాడు.
పంచాయతీ పదనిసలు
పంచాయతీ పదనిసలు


