ఎల్లమ్మగూడంలో కాంగ్రెస్ విజయం
తిప్పర్తి : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెంలో కాంగ్రెస్ మద్దతుదారు ఊట్కూరు వాణి సందీప్‌రెడ్డి విజయం సాధించారు. ఎల్లమ్మగూడెం నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ గ్రామానికి బీసీ సంఘాల నాయకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తి కావడంతో ఆ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఉట్కూరి వాణి సుమారు 459 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి నాగలక్ష్మికి 150ఓట్లు వచ్చాయి.
గొల్లగూడెం తొలి సర్పంచ్‌గా లక్ష్మి
నకిరేకల్ : నకిరేకల్ మండలంలో కొత్తగా ఏర్పాటైన గొల్లగూడెం గ్రామానికి చిర్రబోయిన లక్ష్మి తొలి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో చందంపల్లి గ్రామం పరిధిలో గొల్ల గూడెం ఉండేది. ఈ ఎన్నికల ముందు కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గొల్లగూడెం పంచాయతీ పరిధిలో అడవి బొల్లారం, భూపతి కుంట గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీలో మొత్తం 592 మంది ఓటర్ల ఉన్నారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో గొల్లగూడెం సర్పంచ్ పదవితో పాటు 8 వార్డులను కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. సర్పంచ్‌గా చిర్రబోయిన లక్ష్మి, ఉప సర్పంచ్‌గా బొప్పిడి మహిందర్‌రెడ్డి ఎన్నికయ్యారు.
తైక్వాండో పోటీలకు కోచ్‌గా ఎంపిక
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 12 నుంచి 14 వరకు నిర్వహించనున్న 41వ జాతీయ తైక్వాండో పోటీలకు జాతీయ రెఫరీగా నల్లగొండకు చెందిన సీనియర్ కోచ్ ఎండీ.యూనుస్ కమాల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా యూనుస్ కమాల్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో జాతీయ రెఫరీగా ఎంపిక చేసిన రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి
నాగార్జునసాగర్ : బస్తీ దవఖానాకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పుట్ల శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం నాగార్జునసాగర్‌లోని పైలాన్ కాలనీలో ఉన్న బస్తీ దావఖానాను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్‌సీడీ, ఏఎన్‌సీల నమోదు పక్రియ, వాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జర్వాలతో బాధపడుతున్న వారికి అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. ఆయన వెంట జిల్లా టీబీ నివారణ అధికారి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు.
యాదగిరీశుడి సన్నిధిలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలను అర్చకులు ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామున ఆలయాన్ని తెరచిన అర్చకులు.. శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళ అర్చనతో కొలిచారు. ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.


