అధికార పార్టీకి.. పల్లె ఓటర్ల పట్టం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పల్లె ఓటర్లు అధికార కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. జిల్లాలో మొదటి విడతలో నల్లగొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 14 మండలాల్లోని పంచాయతీల్లో గురువారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆశించిన స్థానాలను దక్కించుకోలేకపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్ బెడద ఉన్నప్పటికీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థులు 13 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 2 పంచాయతీల్లో విజయం సాధించింది. స్వతంత్ర అభ్యర్థులు 5 స్థానాల్లో గెలుపొందారు.
కాంగ్రెస్ అంచనాలకు
అనుగుణంగా ఫలితాలు
పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని మొదటి నుంచి కాంగ్రెస్ భావించింది. అందుకు తగ్గట్టుగానే.. తొలి విడత ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ.. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని, పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు తమ పార్టీ మద్దతుదారులే గెలుపొందుతారని ఆశించింది. కానీ అందుకు విరుద్ధంగా పల్లె ఓటర్లు తీర్పు ఇచ్చారు. మొదటి విడత 318 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు కలుపుకుని 199 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, 79 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రెబల్, బీజేపీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు 40 స్థానాలకే పరిమితమయ్యారు.
కాంగ్రెస్ రెబల్స్ కూడా ఆ పార్టీ కోటాలోనే..
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు 13 మంది విజయం సాధించారు. పార్టీ మద్దతు వస్తుందని ఆశించి భంగపడ్డ వారు రెబల్ అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. నామినేషన్ల ఉపసంహరణ వరకు పార్టీ మండల, నియోజక వర్గ నేతలు ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో గెలిచిరండి అంటూ ఆ పార్టీ నేతలు చెప్పడంతో ఎవరికి వారు బలంగా ప్రచారం చేసుకుని విజయం సాధించారు. వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లుగానే పరిగణించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల సంఖ్య మరింత పెరగనుంది.
బీఆర్‌ఎస్‌కు నిరాశ మిగిల్చిన ఫలితాలు
పల్లె ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా స్థానాలు దక్కలేదు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో నల్లగొండ, నకిరేకల్, మునుగోడు నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారంతా ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే అధిక స్థానాలు దక్కాయి.
పలు చోట్ల రీకౌంటింగ్
ఎన్నికల జరిగిన పలు గ్రామాల్లో అభ్యర్థులకు సమాన ఓట్లు రావడం, డ్రా తీసేందుకు అంగీకరించకపోవడంతో రీకౌంటింగ్ చేపట్టారు.
● నార్కట్‌పల్లి మండలం చిన్న నారాయణపూర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థికి సమాన ఓట్లు వచ్చాయి. అయితే వారు డ్రా తీసేందుకు ఒప్పుకోలేదు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించారు.
● ఏపీ లింగోటంలో ఒక అభ్యర్థికి తక్కువ ఓట్లు రావడంతో కౌంటింగ్ మళ్లీ నిర్వహించాలని పట్టుపట్టడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు.
● తిప్పర్తి మండలం జొన్నగడ్డలగూడెం గ్రామంలో 2 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి రీకౌంటింగ్‌కు పట్టుబట్టినా ఎన్నికల అధికారి అంగీకరించలేదు. అవసరమైనతే కోర్టుకు వెళ్లాలని సూచించారు.
● అన్నిశెట్టిదుప్పలపల్లిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి 3 ఓట్లతో విజయం సాధించారు. దీంతో ప్రత్యర్థి రీకౌంటింగ్ నిర్వహించాలని పట్టుబట్టినా అధికారులు ఒప్పుకోలేదు.
● కనగల్ మండలం లచ్చుగూడెంలో 8వ వార్డులో ఇద్దరు అభ్యర్థులకు 38 ఓట్ల చొప్పున వచ్చాయి. అయితే ఐదు చిట్టీలు వేసి డ్రా పద్ధతిన వార్డు సభ్యుడిని ఎంపిక చేశారు.
ఫ తొలి విడతలో అత్యధిక పంచాయతీలు
కై వసం చేసుకున్న కాంగ్రెస్ మద్దతుదారులు
ఫ 318 గ్రామాల్లో 22 ఏకగ్రీవం 296 పంచాయతీల్లో ఎన్నికలు
ఫ కాంగ్రెస్ పార్టీకి 199 పంచాయతీలు
ఫ బీఆర్‌ఎస్‌కు దక్కింది 79 స్థానాలే..
ఫ కాంగ్రెస్ రెబల్స్ 13 మందితో కలుపుకొని 31 స్థానాల్లో ఇతరుల విజయం
మండలాల వారీగా పార్టీల మద్దతుదారులు గెలుచుకున్నవి స్థానాలు ఇలా..
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ సీపీఐ/సీపీఎం ఇతరులు
నల్లగొండ 31 19 10 1 0 1
తిప్పర్తి 26 20 6 0 0 0
కనగల్ 31 25 6 0 0 0
శాలిగౌరారం 24 16 7 0 0 1
నకిరేకల్ 17 12 3 0 0 2
చిట్యాల 18 11 5 0 1 1
కట్టంగూరు 22 12 5 0 0 5
చండూరు 19 7 7 1 1 3
నార్కట్‌పల్లి 29 17 7 0 1 4
గట్టుప్పల్ 7 5 1 0 0 1
నాంపల్లి 32 19 9 1 0 3
కేతేపల్లి 16 11 4 0 0 1
మునుగోడు 28 16 5 0 2 5
మర్రిగూడ 18 9 4 0 1 4
మొత్తం 318 199 79 3 6 31


