రెండవ విడత ప్రచారానికి నేటితో తెర
ఫ మిర్యాలగూడ డివిజన్‌లోని 10 మండలాల్లో 14న పోలింగ్
మిర్యాలగూడ : రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెర పడనుంది. ఈ నెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అయితే 48 గంటల ముందు ప్రచారాన్ని ఆపాల్సి ఉండడంతో ఆ గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో తీరనుంది. వారం రోజులుగా నామినేషన్లు, ప్రచారాలతో సందడి నెలకొన్న గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి ప్రచారం ఆగిపోనుంది. ఇక, పోలింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బందికి కూడా రెండు విడతల్లో శిక్షణ ఇచ్చారు.
282 పంచాయతీల్లో ఎన్నికలు
రెండవ విడతలో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లోని 282 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 14న పోలింగ్ జరగనున్నందున.. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. 13వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత అదేరోజు 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. దీంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.


