ఉరుమడ్ల గ్రామంలో ఉద్రిక్తత
చిట్యాల : చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో గురువారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే గ్రామంలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసం ఎదుట రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, నార్మాక్స్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి తమ పార్టీ బలపర్చిన అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి తరఫున అదే గ్రామానికి చెందిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, ఆ పార్టీ నాయకులు ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఓటు హక్కు లేని వారు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ నాయకులతో కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐలు నాగరాజు, పీఎన్‌డీ ప్రసాద్ అక్కడకు చేరుకొని ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం కాసేపటికి పోలింగ్ బూత్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ఓట్లు అభ్యర్థిస్తున్నారంటూ గుత్తా అమిత్‌రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్దకు దూసుకొచ్చారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రాన్ని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి సందర్శించారు.
ఫ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం


