
నీలగిరి మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలు
బకాయిలు చెల్లించి సహకరించాలి
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా పన్ను బకాయిలు మొత్తం రూ. 28 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో మొదటి 500 మంది బకాయిదారుల లెక్కలు తీయగా రూ.9.68 వరకు ఉన్నట్లు తేలింది. వీరంతా రాజకీయ పైరవీరలతో కాలం గడుపుతూ ఆస్తిపన్ను చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది మొండి బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోలైనా వసూలు చేయడానికి మున్సిపల్ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. నలుగురు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో కలిసి 36 మంది వార్డు ఆఫీసర్లతో బకాయిదారులందరికీ రెడ్ నోటీస్‌లు అందజేస్తోంది.
వారం గడువు.. తరువాత ఆస్తుల జప్తు
ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయి పడ్డ తొలి 500 మంది జాబితాను ప్రత్యేకంగా తయారు చేసింది. వీరితోపాటు పాత బకాయి ఉన్న వాణిజ్య, వ్యాపార దుకాణాలు, ఫంక్షన్‌హాల్స్, మాల్స్ యజమానులకు రెడ్ నోటీసులు ఇస్తున్నారు. రెడ్ నోటీస్‌లు తీసుకున్న వారు ఆస్తి పన్ను చెల్లించడానికి వారం రోజులు గడువు ఉంది. వారు వారం రోజుల గడువులోగా ఆస్తి పన్ను చెల్లించకుంటే మున్సిపల్ చట్టం వారి ఆస్తులను జప్తు చేయాలని మున్సిపల్ యంత్రాంగం నిర్ణయించింది. అయితే.. గత మార్చి నెలలో కూడా రెడ్ నోటీస్‌లు జారీ చేసినా బకాయిపడ్డ యజమానులు ఆస్తి పన్ను చెల్లించకుండా రేపు, మాపు అంటూ కాలయాపన చేశారు. ఈ సారి ఫిబ్రవరి, మార్చి వరకు వేచి చూడకుండా మున్సిపల్ యంత్రాంగం ముందస్తుగానే స్పందించింది.
మూడు నెలల్లో వసూలు చేయాలని లక్ష్యం
ఈ సారి అక్టోబర్ నెలలోనే నోటీస్‌లు ఇస్తుండడంతో ఇక బకాయిదారులు ఎన్ని వాయిదాలు పెట్టినా తప్పించుకునే అవకాశం లేకపోవచ్చు. ఇప్పటి నుంచి మూడు నెలల్లోనే మొత్తం పాత బకాయిలు వసూలు చేయాలనే లక్ష్యంతో మున్సిపల్ అధికారులు ముందుకుపోతున్నారు. అయితే.. బకాయిలు మొత్తం వసూలు చేయాలంటే రాజకీయ నాయకులు.. బకాయిదారులకు మద్దతుగా నిలవపోతే సాధ్యమయ్యే అవకాశం ఉంది. కానీ కొందరు ఓట్ల కోసం బకాయిదారులను వెనకేసుకొస్తున్నారన్న ప్రచారం ఉంది. కానీ అలాంటి వారితో పోటీ చేసే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని కొందరు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.
కొన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయిపడ్డ వారి జాబితా తయారు చేశాం. పాత బకాయిలు రూ.28 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం బకాయిపడ్డ వారికి రెడ్ నోటీస్‌లు జారీ చేస్తున్నాం. వారం రోజుల్లో చెల్లించకుంటే చట్ట ప్రకారం ఆస్తుల జప్తు చేస్తాం.
– శివరాంరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్, నల్లగొండ
ఫ కేవలం 500 మందివే రూ.9.68 కోట్లు
ఫ పన్ను వసూలుకు ప్రత్యేక బృందాలు
ఫ బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేస్తున్న యంత్రాంగం
ఫ వారంలోగా చెల్లించకుంటే.. ఆస్తి జప్తు చేస్తామని హెచ్చరిక

నీలగిరి మున్సిపాలిటీలో పేరుకుపోయిన బకాయిలు