
పోలీస్ అమరుల త్యాగాలు మరువలేనివి
నల్లగొండ : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ కార్యాలయంలో పోలీసు అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడూతూ పోలీస్‌శాఖ శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారక్షణకు విధి నిర్వహణలో ప్రాణాలు లెక్క చేయకుండా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలు మరువలేమన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎంతో శ్రమకోర్చి, ప్రాణాలు లెక్క చేయకుండా పని చేస్తున్నారని.. వారి త్యాగాల వల్లే శాంతియుత వాతావరణం ఏర్పడిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 15 మంది విధుల్లో అమరులయ్యారని, వారి కుటుంబ సభ్యులకు తమ శాఖ అండగా ఉంటుందన్నారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని పోలీస్‌స్టేషన్లలో ఈనెల 30 వరకు వివిధ కార్యక్రమాలు, పోలీస్ ఓపెన్ హౌజ్, రక్తదాన శిబిరాలు, షార్ట్ ఫిల్మ్, ఫొటోగ్రఫి, వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాఘవరావు, రాము, మహాలక్ష్మయ్య, రాజశేఖర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, శ్రీనునాయక్, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, సూరప్పనాయుడు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి