
వందశాతం ఉత్తీర్ణతే ధ్యేయం
తిరుమలగిరి(నాగార్జునసాగర్): టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా కేజీబీవీల్లో ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నట్లు జీసీడీఓ కత్తుల అరుంధతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, సిబ్బంది హాజరు పట్టికలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులను పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను ఆరోజే చదువుకోవాలని, సబ్జెక్టు పరంగా ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా వంటగది, భోజనశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మెనూను తప్పనిసరిగా అమలు చేసి విద్యార్థినులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు.