
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
నల్లగొండ: వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లో రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్‌రెడ్డి, పౌర సంబంధాల అధికారులతో ధాన్యం సేకరణపై హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలుకుగాను 375 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు అవసరమైన సామగ్రిని పంపించామని, ఇంకా మరో 25 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపించే విషయంలో లారీల సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మిల్లుల వద్ద అన్ లోడింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్