
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
ఫ సీపీఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్
ఫ నల్లగొండలో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు
నల్లగొండ టౌన్ : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరించి అబద్ధపు ప్రచారం చేయడాన్ని ఆపాలని సీపీఎం పొలిట్ బ్యూరో మాజీ సభ్యురాలు బృందాకరత్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. అనంతరం బందాకరత్ మాట్లాడుతూ భారత చరిత్రలో సెప్టెంబర్ 17 లిఖించబడిందని, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ సంస్థానం సెప్టెంబర్ 17న 1948న ఇండియన్ యూనియన్‌లో విలీనమైందన్నారు. ఒక సంవత్సరం పాటు జరిగిన పరిణామాలను వక్రీకరించి రకరకాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రక్షణమంత్రి హైదరాబాద్ వస్తూ తనతో పాటు అబద్దాలు తయారు చేసే మిషన్ తెచ్చారని ఎద్దేవా చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం రాజు, హిందువులకు జరిగిన పోరాటమని చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల గ్రామాలను సందర్శించి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. ఆనాడు దేశంలో మరోప్రాంతం జమ్ముకశ్మీర్ కూడా విలీనమైందని అక్కడ రాజు హరిసింగ్ హిందూ, ప్రజలు ముస్లింలు అక్కడ ఎందుకు ఇలా ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దేశంలో ముస్లింలు, హిందువులు, సిక్కులు సబ్బండ వర్గాలు స్వాతంత్య్రం కోసం పోరాడాని గుర్తు చేశారు. నైజాంతో పాటు లక్షల ఎకరాల భూములను చేతిలో పెట్టుకున్న భూస్వాములు, దోపిడీదారులపై జరిగిన ఉద్యమమే వీర తెలంగాణ సాయుధ పోరాటమన్నారు. ఆనాటి అమరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు మర్రిగూడ బైపాస్ నుంచి సుభాష్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, బొంతల చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, నాగార్జున, ప్రమీల, హశం, ప్రభావతి, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, ఎండీ.సలీం, సత్తయ్య, అనురాధ, నన్నూరి వెంకట రమణారెడ్డి, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ