తీరని యూరియా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తీరని యూరియా కష్టాలు

Sep 16 2025 8:23 AM | Updated on Sep 16 2025 8:23 AM

తీరని యూరియా కష్టాలు

తీరని యూరియా కష్టాలు

పీఏసీఎస్‌, ఆగ్రోస్‌ కేంద్రాల వద్ద పడిగాపులు

అక్కడక్కడా ఆందోళనలకు దిగుతున్న రైతులు

నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌, మూసీ ఆయకట్టుతోపాటు బోరుబావుల కింద వరిపంట సాగు చేసిన రైతులు రెండు నెలలుగా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి రైతుకు రెండు బస్తాలు యూరియా ఇస్తుండడం, అది కేవలం ఎకరం పొలానికే సరిపోతుండడంతో ఎక్కువ ఎకరాలు సాగుచేసిన రైతులు యూరియా కోసం పీఏసీఎస్‌ల వద్ద బారులుదీరుతున్నారు. జూన్‌, జూలైలో మొదటిసారి చల్లాల్సిన యూరియా జూలై, ఆగస్టు నెలలో చల్లారు. ఎక్కువ భాగం పంటలకు యూరియా చల్లినప్పటికీ కొంతమేరకు ఇంకా చల్లాల్సి ఉంది. రెండవ విడత అక్టోబర్‌లో యూరియా చల్లాల్సి ఉంది. అలాగే జిల్లాలో పత్తిపంటకు కూడా యూరియా వేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తుగా కొనుగోలు చేసేందుకు రైతు సహకార సొసైటీలు, ఆగ్రోస్‌ దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈనెల చివరి వరకు కూడా రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

60వేల మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ

జిల్లా వ్యాప్తంగా 33 మండలాలకు గాను వానాకాలం సీజన్‌కు 70వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉంది. జూన్‌లో యూరియా వాడకం ప్రారంభమైంది. సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తిస్థాయిలో యూరియా రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 60వేల మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. కానీ, జిల్లాలో ఆయకట్టు విస్తీర్ణం పెరగడం వల్ల పంటలకు ఎక్కువగా నత్రజని అవసరం ఉండగా యూరియా వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా మొత్తానికి 80వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉండగా వ్యవసాయాధికారులు మాత్రం కేవలం 70వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదించారు.

నానో యూరియా వాడకంపై ప్రచారం

భవిష్యత్‌లో ఎరువుల వాడకాన్ని తగ్గించి ద్రవరూపంలో ఉన్న నానో యూరియాను వాడాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రాలకు యూరియా కేటాయింపు తగ్గించింది. దీంతో యూరియా కొరతపై ప్రభావం పడింది. ఇందులో భాగంగా బీజేపీయేతర రాష్ట్రాల్లో ఎరువుల కేటాయింపు తగ్గించడం, నానో యూరియాపై ప్రచారం చేయింస్తోంది. కాగా ఒక యూరియా బస్తా రూ.265కు విక్రయిస్తుండగా లీటర్‌ నానో యూరియా రూ.150 నుంచి రూ.200కు లోపు దొరుకుతుంది. కానీ, ద్రవరూపంలోని యూరియా వాడకంలో స్ప్రే మిషన్‌తోపాటు ఇద్దరు కూలీలు అవసరం ఉండడం వల్ల ఖర్చు పెరుగుతుందని రైతులు ఘనరూపంలోని యూరియా కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు.

అక్టోబర్‌లో యూరియా వాడకం చాలా కీలకం

కొన్ని ప్రాంతాల్లో వరిపంటను సాగుచేసి రెండు నెలలు దాటగా మరికొన్ని చోట్ల నెల, 45రోజులు అయింది. నాట్లు వేసిన 15–20రోజులలోపు దూపు కాడలు రావడానికి, పంటకు నత్రజని అందించేందుకు ఒకసారి యూరియాను చల్లుతారు. మళ్లీ రెండు నెలల తరువాత పంట గింజ తయారయ్యే సమయంలో యూరియాను చల్లుతారు. రెండోసారి 40–50 రోజుల మధ్య చల్లే యూరియా పంటకు బలం చేకూరుస్తుంది. అందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమయంలో యూరియాను చల్లుతారు. కాగా మొదటి దశలోనే యూరియా కొరత తీవ్రంగా ఉండడం వల్ల రెండో దశలో యూరియా దొరుకుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన నెలకొంది.

యూరియా కోసం రాస్తారోకో

పెద్దవూర: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. పెద్దవూర మండలంలోని పలు గ్రామాల నుంచి రైతులు సోమవారం వేకువజామునే ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం వద్దకు వచ్చి వరుసలో నిల్చున్నారు. రెండు, మూడు రోజుల క్రితం ఇచ్చిన టోకెన్లకు యూరియా బస్తాలు ఇచ్చారు. వీరితో పాటు మూడొందలకు పైగా రైతులు పీఏసీఎస్‌ వద్దకు వచ్చి తమకు టోకెన్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. మధ్యాహ్నం జీరాక్స్‌ కాపీలను వరుసలో పెట్టిన రైతులందరికీ టోకెన్లు జారీచేస్తామని అధికారులు చెప్పారు. తర్వాత భోజనాన్ని వెళ్లి వస్తామని సాయంత్రం నాలుగు గంటలైనా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు మండల కేంద్రంలోని కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. గంటన్నరకు పైగా రాస్తారోకో చేయడంతో ఎటూ కిలోమీటర్‌ దూరం వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జిల్లా వ్యవసాధికారి, కలెక్టర్‌ వచ్చేదాకా రాస్తారోకోను విరమించేది లేదన్నారు. పోలీసులు వచ్చి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం అందరికీ టోకెన్లు జారీ చేయిస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.

యూరియా (వేల మెట్రిక్‌ టన్నుల్లో)

జిల్లాకు కావాల్సిన యూరియా 80

ప్రభుత్వానికి నివేదించింది 70

ఇప్పటి వరకు పంపిణీ చేసింది 60

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement