
రేపు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం
ఫ జాతీయజెండా ఆవిష్కరించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని పేర్కొన్నారు. అనంతరం బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి తెలిపారు.
విద్యారంగంలో మతోన్మాద బీజాలు
చండూరు: విద్యారంగంలో మతోన్మాద బీజాలు నాటుతున్న బీజేపీపై పోరాడాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ పిలుపునిచ్చారు. సోమవారం చండూరులో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యా వైజ్ఙానిక శిక్షణ తరగతుల రెండో రోజు సభకు వారు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశ విద్యారంగంలో విద్యార్థులకు మూడవిశ్వాసాలను బోధింపజేస్తూ విద్యారంగాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రాష్ట్ర కోకన్వీనర్ కుంచం కావ్య, సైదానాయక్, బెడిగ వెంకటేశ్, కోరె రమేష్, రవీందర్, కిరణ్, నవదీప్, జగన్, జగదీష్, వీరన్న, ప్రసన్న, ప్రణీత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలకు చెందిన బీఎస్సీ ఎంపీసీఎస్ ఫస్టియర్ విద్యార్థి ఎన్.మనోజ్ తెలంగాణ స్టేట్ తైక్వాండో అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్ 73 కేజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. త్వరలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పీడీ డాక్టర్ ఏ.మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్‌ను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.
మూడు గేట్ల ద్వారా ‘మూసీ’నీటి విడుదల
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 6,019 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు సోమవారం ప్రాజెక్టు మూడు క్రస్ట్‌గేట్లను రెండు అడుగుల మేర పైకెత్తి ఉంచి 4,836 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 434 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో నీటిమట్టం 643.70 అడుగుల వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వచ్చే నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అఽధికారులు పేర్కొన్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 4.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
శివాలయంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సోమవారం సంప్రదాయ పూజలు ఘనంగా నిర్వహించారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శివపార్వతుల సేవను ఊరేగించారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు కొనసాగాయి. సుప్రభాత సేవ, నిత్యకల్యాణం నిర్వహించారు.

రేపు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం