
‘బాలెంల’ బలగంతో తిరుగుబాటు
సూర్యాపేట అర్బన్: సాయుధ పోరాటంలో భాగంగా 1946 అక్టోబర్ 18న తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు బాలెంల గ్రామాని చుట్టుముట్టారు. అప్పటికే గ్రామంలో ఉన్న నాయకులు పసిగట్టి తీవ్రంగా ప్రతిఘటించారు. తప్పని పరిస్థితుల్లో గ్రామ యువకులు గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి, సుంకు రంగయ్య, జమాల్ సాబ్, చాకలి భిక్షం, చాకలి చెన్నయ్య చేతికి అందిన గునపాలు, ముల్లు కరల్రు, రోకల్లలో పోలీసులతో గంటకు పైగా భీకర యుద్ధం చేశారు. పోలీసుల తుపాకులు లాక్కొని వారిని ఉరికించారు. దీంతో పోలీసులు పారిపోయారు. తిరిగి దొంగచాటుగా 25 మంది పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి విక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఆయుధాలు లేని యువకులు పోలీసు మూకలను ఎదుర్కోవడం సాధ్యం కాలేదు. పోలీసుల కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి, పటేల్ మట్టారెడ్డి అమరులయ్యారు.