
జిల్లాలో మిగిలిపోయిన 5,927 మెట్రిక్ టన్నుల బియ్యం
ఎట్టకేలకు ఇ– వేలం వేసేలా నిర్ణయం
సాక్షి ప్రతినిది, నల్లగొండ: జిల్లాలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఇ–వేలం ద్వారా అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. జిల్లాలోని గోదాములు, మండల స్థాయి స్టాక్ పాయింట్లు (ఎంఎల్‌ఎస్), రేషన్ షాపుల్లో మిగిలిపోయిన ఆ బియ్యాన్ని వేలం వేసేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ ఈ వేలం ద్వారా మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించగా, అందులో జిల్లా వ్యాప్తంగా 5,927 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేసేందుకు సిద్ధమవుతోంది.
ఆరు నెలల తరువాత..
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పథకాన్ని ఈ ఏడాది మార్చి 30న ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో కూడా అదే రోజునుంచి రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యాన్ని అందిస్తోంది. అయితే అప్పటి వరకే ఆయా రేషన్ షాపులతోపాటు గిడ్డంగులు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. అయితే సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం, వర్షాకాలం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలెవరూ వర్షాలు కురిసేప్పుడు రేషన్ షాపులకు వెళ్లి ఇబ్బంది పడకుండా ఒకేసారి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్‌ను జూన్ నెలలోనే పంపిణీ చేసింది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ షాపులు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గోదాములన్నీ మూసే ఉన్నాయి. అయితే అప్పటికే రేషన్‌షాపులు, గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఉన్న దొడ్డు బియ్యం విషయంలో మాత్రం ప్రభుత్వం అప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అవన్నీ ఆరు నెలలుగా వాటిల్లోనే ఉండిపోయాయి. రెండు నెలలు రేషన్ షాపులు తెరవక పోవడంతో కొన్ని చోట్ల ఆ బియ్యానికి పురుగులు పడుతున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఆరు నెలల తరువాత ప్రస్తుతం నెలలో రేషన్ షాపులు మళ్లీ తెరిచి సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అయితే సన్న బియ్యం, దొడ్డు బియ్యం ఒకేచోట ఉండటంతో దొడ్డు బియ్యానికి పట్టిన పురుగులు సన్న బియ్యానికి పట్టే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు సన్న బియ్యం వస్తున్న తరుణంలో పాత దొడ్డు బియ్యం కూడా అవే షాపుల్లో నిల్వ ఉండటంతో స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, గోదాములకు తీసుకెళ్లాలని రేషన్ డీలర్ల సంఘం నాయకులు కలెక్టర్‌కు, ప్రభుత్వానికి విన్నవించారు. అయినా ప్రభుత్వం అప్పట్లో వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఆరు నెలల తరువాత ప్రభుత్వం ఎట్టకేలకు దొడ్డు బియ్యాన్ని ఇ–వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కిలోకు రూ.24ల చొప్పున ఈ వేలం ద్వారా విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. గిడ్డంగులు, ఇటు రేషన్ షాపుల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల బియ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అదేవిధంగా వానాకాలం సీజన్ చివరి దశకు వస్తుండటంతో మళ్లీ కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్ బియ్యం) వస్తే నిలువ చేసుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనికి తోడు ఆరు నెలలుగా అలాగే ఉండిపోయిన బియ్యం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి భారం తగ్గడంతో పాటు, ఆదాయం రానుంది.
ఫ ఏప్రిల్ నుంచి ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం
ఫ అంతకు ముందు నెలల్లో వచ్చి అలాగే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం
ఫ విక్రయించి భారం తగ్గించుకునేలా ప్రభుత్వం చర్యలు
దొడ్డు బియ్యం నిల్వలు ఇలా..
(మెట్రిక్ టన్నుల్లో..)
గోదాముల్లో 4,322.057
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 105.792
రేషన్ షాపుల్లో 1,500

జిల్లాలో మిగిలిపోయిన 5,927 మెట్రిక్ టన్నుల బియ్యం