
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
నల్లగొండ: జిల్లాను టీబీ, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం ఆయన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, ముఖ్యులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి భారత ప్రధాని ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. జిల్లాలో కవులు, కళాకారులు, రచయితలు వివిధ రంగాల్లోని ప్రముఖులను టీబీ ముక్త్ భారత్‌లో భాగస్వాములను చేసి వారితో వివిధ చైతన్య కార్యక్రమాల చేపట్టడం ద్వారా టీబీ నిర్మూలనకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనపై శ్రద్ధ తీసుకోవాలని, మహిళా సాధికారతకు కృషి చేయాలన్నారు. విశ్వవిద్యాలయ వీసీల నుంచి కింది స్థాయి వరకు అందరూ భాగస్వాములు అయితే టీబీ, మాదకద్రవ్యాలను పూర్తిగా నివారించవచ్చన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు అందేలా చూడాలన్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు సమాజానికి సేవ చేసేలా ఎంపీ రఘువీర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య, విద్య పథకాల అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేసి జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు.
పథకాలపై కలెక్టర్
పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పలు పథకాల గురించి సమగ్రంగా వివరించారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు వివరించారు. అలాగే లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్ మోహన్, ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ పుల్లారావు, వైద్యులు జయప్రకాశ్‌రెడ్డి, సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా, కవి సగర్ల సత్తయ్య, దుశ్చర్ల సత్యనారాయణ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కృష్ణకాంత్ నాయక్, రైతు రాంరెడ్డి, పదవ తరగతి జిల్లా టాపర్ విద్యార్థిని అమూల్య, హెచ్‌ఐవీపై పనిచేస్తున్న సంఘసంస్కర్త మేరీలు వారు చేస్తున్న సేవల వివరాలను గవర్నర్‌కు వెల్లడించారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు, చికిత్స, తదితర అంశాలను గవర్నర్‌కు వివరించారు. అంతకు ముందు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎంపీ రఘువీర్‌రెడ్డిలు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను శాలువా, మెమెంటోతో సన్మానించారు.
యంత్రాంగంతో కలిసి పనిచేస్తాం :
ఎంపీ రఘువీర్‌రెడ్డి
నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ టీబీ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ముఖ్యుల సలహాలు తీసుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉందని, దీనివల్ల టీబీవంటి వ్యాధులు సోకకుండా ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డీఎఫ్‌ఓ రాజశేఖర్, రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఫ మాదకద్రవ్యాల నిర్మూలనపై దృష్టిపెట్టండి
ఫ మారుమూల ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి
ఫ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఫ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో ముఖాముఖి

టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి