
నేటి ప్రజావాణి రద్దు
నల్లగొండ: నల్లగొండకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో జిల్లా అధికారులతో గవర్నర్ సమీక్ష సమావేశం, వివిధ కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి రద్దు చేశామని.. బాధితులు కలెక్టరేట్‌కు రావద్దని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 22న జరిగే ప్రజావాణికి హాజరు కావాలని సూచించారు.
పోలీస్ గ్రీవెన్స్‌డే కూడా..
నల్లగొండ : గవర్నర్ జిష్టుదేవ్ వర్మ నల్లగొండ పర్యటన నేపథ్యంలో సోమవారం నిర్వహించాల్సిన పోలీస్ గ్రీవెన్స్‌డే రద్దు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు ఈ విషయం గమనించి.. ఈ నెల 22న జరిగే పోలీస్ గ్రీవెన్స్‌డేకు హాజరు కావాలని పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం
చండూరు : విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం చండూరులో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని, విద్యకు కనీసం 25 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలు, ఇతర బకాయిలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముల్కలపల్లి రాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, భరత్, సైదానాయక్, కుంచం కావ్య, బుడిగ వెంకటేశ్, కోరె రమేష్, రవీందర్, కిరణ్, నవదీప్, జగన్, జగదీశ్, వీరన్న, సైఫ్, ప్రసన్న, ప్రణీత్, రమేష్ పాల్గొన్నారు.
కమ్యూనిస్టుల
పోరాటంతోనే విముక్తి
చిట్యాల : నిజాం, రజాకార్ల దౌర్జాన్యాలపై కమ్యూనిస్టు పార్టీలు చేసిన పోరాటంతోనే నాటి తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో ఆదివారం వారు అమరవీరులకు నివాళులర్పించి, పార్టీ జెండాను ఎగురవేశారు. ఆనంతరం వారు మాట్లాడుతూ నాటి పోరాటంలో నాలుగు వేల మంది బలిదానం కాగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచామని, మూడు వేల గ్రామాల ప్రజలకు విముక్తి లభిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర నాయకుడు బొంతల చంద్రారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల, పాలడుగు నాగార్జున, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, బొజ్జ చినవెంకులు, మల్లం మహేష్, జిట్ట సరోజ, పెంజర్ల సైదులు, రాచకొండ వెంకటేశ్వర్లు, శ్రీను, లింగస్వామి, ఐతరాజు నర్సింహ, నరేష్, యాదయ్య పాల్గొన్నారు.
బుద్ధవనాన్ని సందర్శించిన డిప్యూటీ అకౌంటెంట్ జనరల్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ సంజయ్ కామినేని సందర్శించారు. అంతకుముందు నాగార్జునసాగర్ డ్యామ్‌ను, ఎత్తిపోతల జలపాతాన్ని సందర్శించారు. బుద్ధవనం సందర్శనలో భాగంగా బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించి మహాస్థూపం అంతర్భాగంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం విశేషాలను తెలిపే వీడియోను వీక్షించారు. అనంతరం ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించారు. బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఆయనను కండువాలతో సత్కరించారు. వీటిని స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం విశేషాలు, చారిత్రక వివరాలను తెలియజేశారు. వీరితో పాటు సీనియర్ ఆడిట్ ఆఫీసర్ బ్రిజేష్ కుమార్, నాగార్జునసాగర్ డ్యాం డివిజన్ కార్యాలయ సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్, ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.

నేటి ప్రజావాణి రద్దు