
చేతికొస్తున్న పత్తి
ఆశాజనకంగా పత్తి చేలు..
ఫ మొదటి దశ పత్తి తీత
పనులు ప్రారంభం
ఫ ఈ ఏడాది అంచనాకు
మించి సాగు
ఫ 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో తెల్ల బంగారమైన పత్తి చేతికొస్తోంది. పత్తి తీత పనులను ఇటీవల రైతులు ప్రారంభించారు. మునుగోడు, చండూరు, నల్లగొండ, మర్రిగూడ, చింతపల్లి, నాంపల్లి, దేవరకొండ, చందంపేట, గుర్రంపోడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పత్తిసాగు కాగా.. ఈ సారి 45 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది. ఈ సారి పత్తి పంట సిరులు కురిపిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అంచనాలకు మించి సాగు..
జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ అంచనాలకు మించి రైతులు పత్తి పెద్ద ఎత్తున సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5,47,735 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా అంచనాకు మించి 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి వేశారు. అత్యధికంగా నాంపల్లి మండలంలో 46,959 ఎకరాల్లో, చింతపల్లి 41,375ఎకరాల్లో, మునుగోడులో 39,657 ఎకరాల్లో సాగు చేశారు. ఈ సారి మంచి అదునైన వర్షాలు కురవడంతో రైతులు పత్తి చేలకు 2, 3 దఫాలుగా ఎరువులను పెట్టుకున్నారు. దీంతో పత్తి చేలు ఏపుగా పెరిగి కాయదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పెద్ద ఎత్తున ఒక్కో చెట్టుకు 10 నుంచి 20 వరకు కొమ్మలు వచ్చి పెద్ద ఎత్తున కాయలు కాశాయి. వర్షాలు పెద్ద ఎత్తున కురిసిన కారణంగా పత్తి చేలకు చీడ పీడలు పెద్దగా ఆశించలేదు.
జిల్లాలో 5,64,585 ఎకరాల్లో పత్తి సాగు కాగా ఎకరాకు సగటున 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంతో సుమారు 45 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి మద్దతు ధరను రూ.8,110గా ప్రకటించిన నేపథ్యంలో రైతులకు మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
జిల్లా అంతటా పత్తి చేలకు మంచి అదునైన వర్షం కురవడంతో చేలు ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి దశ పత్తి తీసే పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పత్తి దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు వస్తుంది. రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్,
జిల్లా వ్యవసాయ అధికారి

చేతికొస్తున్న పత్తి