
రైతులకు యూరియా తిప్పలు
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : యూరియా సమస్య రైతులను వెంటాడుతూనే ఉంది. పంటలు సాగు చేసి నెలల గడుస్తున్నప్పటికీ రైతులకు యూరియా తిప్పలు మాత్రం తప్పడం లేదు. తిరుమలగిరి సాగర్ మండలానికి ప్రత్యేకంగా పీఏసీఎస్ లేకపోవడంలో ఉమ్మడి అనుముల మండలంగానే కొనసాగుతుంది. దీంతో రైతులపై రవాణా ఖర్చు భారం కూడా పడుతోంది. రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఆదివారం తిరుమలగిరి వ్యవసాయ సబ్‌మార్కెట్ యార్డులో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లు అందించారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులుదీరారు. తిరుమలగిరి మండలానికి 80మెట్రిక్ టన్నుల యూరియా రాగా డొక్కలబావితండాలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ద్వారా 40మెట్రిక్ టన్నులు, తిరుమలగిరి మార్కెట్ యార్డులో 40మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశారు. రైతుకు రెండు బస్తాల చొప్పున అందించారు.