
అంగన్‌వాడీల్లో సిబ్బంది కొరత
ఖాళీల వివరాలు ఇలా..
మార్గదర్శకాలు రాలేదు
మిర్యాలగూడ టౌన్ : అంగన్‌వాడీ కేంద్రాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. పెద్దసంఖ్యలో టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీగా ఉండడంతో ఉన్నవారికే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఖాళీ భర్తీకి రిజర్వేషన్ల ప్రక్రియ అడ్డొస్తోందని తెలుస్తోంది.
834 పోస్టులు ఖాళీ
నల్లగొండ జిల్లాలో 9 ప్రాజెక్టుల పరిధిలో 2,093 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6 ఏళ్లలోపు పిల్లలు 75,819 మంది, గర్భిణులు 8,659, బాలింతలు 6,360 మంది నమోదై ఉన్నారు. ఆయా కేంద్రాల్లో 150 టీచర్లు, 684 ఆయాలు మొత్తం 834 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
టీచర్లకు అదనపు బాధ్యతలు
ఒక అంగన్‌వాడీ కేంద్రంలో టీచరు పోస్టు ఖాళీగా ఉంటే సమీప కేంద్రంలోని వారికి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఒక్కో టీచరు రెండు కేంద్రాలకు ఇన్‌చార్జిగా ఉండడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందడం లేదు. అదే విధంగా ఆయాలు లేకపోవడంతో కొన్ని సెంటర్లల్లో టీచర్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు. అక్కడ టీచర్లే భోజనం వండీ వడ్డించాల్సి వస్తోంది. టీచర్లు లేని సెంటర్లలో ఆయాలే అన్నింటినీ చూసుకుంటున్నారు. అయితే వారు ఒక కేంద్రంలో విధుల్లో ఉంటే మరో కేంద్రం మూసి వేయాల్సిన వస్తోంది. కొన్ని కేంద్రాలు తెరవకుండానే వారానికి ఒకసారి వెళ్లి సరుకులు పంపిణీ చేసి వస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
రిజర్వేషన్ల వర్తింపుతో జాప్యం
అంగన్‌వాడీ కేంద్రానికి ఒక టీచరు, ఒక హెల్పర్ విధిగా ఉండాలి. కానీ చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలను ఆ శాఖకు చెందిన అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ప్రస్తుతం టీచర్లు, హెల్పర్లను మూడు గ్రూపులుగా గుర్తించి నివేదిక పంపారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో కొలువుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. అయితే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల వర్తింపు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రాజెక్టు టీచర్లు ఆయాలు
అనుముల 20 65
చింతపల్లి 24 73
దామరచర్ల 11 95
దేవరకొండ 34 99
కొండమల్లేపల్లి 21 66
మిర్యాలగూడ 16 58
మునుగోడు 06 51
నకిరేకల్ 10 87
నల్లగొండ 08 90
మొత్తం 150 684
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలోని అంగన్‌వాడీ టీచర్లకు అదనపు బాధ్యతలను ఇచ్చి చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. పోస్టులు భర్తీ అయ్యేంత వరకు ఎలాంటి సమస్య రాకుండా చూస్తాం.
– కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి, నల్లగొండ
ఫ పెద్దసంఖ్యలో టీచర్లు,
హెల్పర్ల పోస్టులు ఖాళీ
ఫ ఉన్న వారికి అదనపు బాధ్యతలు
ఫ అరకొరగా అందుతున్న సేవలు

అంగన్‌వాడీల్లో సిబ్బంది కొరత