సీజనల్‌ విజృంభణ | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ విజృంభణ

Sep 8 2025 4:44 AM | Updated on Sep 8 2025 5:14 AM

సిబ్బందిని అప్రమత్తం చేశాం

నల్లగొండ టౌన్‌ : జిల్లాలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, డ్రెయినేజీల్లో నీటి నిల్వలు పేరుకుపోయిన కారణంగా దోమలు వ్యాప్తి పెరిగింది. దీనికి తోడు పట్టణాలు, పల్లెలో పారిశుద్ధ్యం లోపించింది. దీంతో ప్రజలు సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ బారిన పడుతున్నారు. రోజురోజుకు జ్వరాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు డెంగీ కేసులు 11, మలేరియా కేసులు 8 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అనధికారికంగా జిల్లాలో 63 వరకు డెంగీ, 27 వరకు మలేరియా కేసులు ఉన్నట్లు సమాచారం. దీంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జ్వరం, కీళ్లనొప్పులు, వంటి నొప్పులతో బాధపడుతూ జనం బారులుదీరుతున్నారు.

ఆస్పత్రుల్లో పెరిగిన ఓపీ

నల్లగొండ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో గతంలో రోజూ ఓపీ (అవుట్‌ పేషంట్‌) 300 వరకు ఉండేది. ప్రస్తుతం 450 వరకు ఓపీ నమోదువుతోంది. ఇన్‌పేషంట్లుగా గతంలో రోజూ 30 వరకు ఉండగా ప్రస్తుతం 50 వరకు చేరుతున్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రులు, మర్రిగూడ సీహెచ్‌సీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంధ్రాలు, అర్బన్‌ హెల్త్‌సెంటర్లు, పల్లె దావాఖానాల్లో కూడా జ్వర బాధితుల సంఖ్య పెరిగింది.

పడకేసిన పారిశుద్ధ్యం..

జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించింది. పాలకవర్గాలు లేకపోవడం, నిధులు లేమి కారణంగా వీధులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. గ్రామాల్లో అయితే సర్పంచ్‌లు లేకపోవడం, పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారు. చెత్తాతెదారం పేరుకుపోయి దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయింది. సీజనల్‌ వ్యాధులు పెరగడానికి ఇది కూడా కారణంగా చెప్పవచ్చు. దోమల నివారణ కోసం మున్సిపల్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని మలేరియా శాఖ పట్టణాలు, పల్లెల్లో ఫాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ రెండు శాఖ ఫాగింగ్‌ చేయడాన్ని మరిచిపోయాయి. సిబ్బంది ఉన్నప్పటికీ పాగింగ్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రైవేట్‌లో పరీక్షల పేరుతో దగా..

జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెలుతున్న బాధితుల నుంచి డెంగీ, మలేరియా ఇతర పరీక్షల పేరుతో ఆస్పత్రుల యాజమాన్యం దగా చేస్తోంది. వివిధ పరీక్షల పేరుతో వేలాది రూపాయలను దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డెంగీ పరీక్షలు కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రమే చేస్తారు. ఎలిసా పరీక్ష ద్వారానే డెంగీ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు ధనార్జనే ధ్యేయంగా డెంగీ పేరుతో అవసరం లేని పరీక్షలు చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

సీజనల్‌ వ్యాధులు అరికట్టేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో మందులు అందుబాటులో ఉంచాం. సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు కూడా పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలి.

– డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ

ఫ పల్లెలు, పట్టణాల్లో

పడకేసిన పారిశుద్ధ్యం

ఫ అంతటా పెరిగిన దోమల వ్యాప్తి

ఫ డెంగీ, మలేరియా,

టైఫాయిడ్‌ బారిన పడుతున్న జనం

ఫ కిటకిటలాడుతున్న

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు

నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క ప్రాంతంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల ఈ ప్రాంతానికి చెందిన షరీఫ్‌ మలేరియా బారినపడి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి డెంగీ,

మలేరియా, ఇతర రక్త పరీక్షలు చేసి రూ.3 వేలు తీసుకున్నారు. డాక్టర్‌ ఫీజు, మందులకు కలిపి మరో రెండు వేల రూపాయలు అయ్యాయి. షరీఫ్‌ కుటుంబంలో ఇద్దరికి మలేరియా సోకింది. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపంతో జనం సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు.

సీజనల్‌ విజృంభణ1
1/1

సీజనల్‌ విజృంభణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement