
గణేష్ నిమజ్జనానికి రెడీ
నల్లగొండ టూటౌన్: గణేష్ నిమజ్జనానికి నల్లగొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం పాతబస్తీలోని ఒకటవ నంబర్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. అదే విధంగా పెద్ద గడియారం సెంటర్‌లో వేదిక ఏర్పాటు చేశారు. పాత బస్తీ విగ్రహాలన్నీ పెద్ద గడియారం సెంటర్ వరకు వచ్చి అనుముల మండలంలోని 14వ మైలు వద్ద నిమజ్జనానికి వెళ్లనున్నాయి. 10 ఫీట్లలోపు గణపతి విగ్రహాలను వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బారికేడ్ల ఏర్పాటుతో పాటు విగ్రహాలను నిమజ్జనం చేయడానికి రెండు క్రేన్లు అందుబాటులో ఉంచారు. పట్టణంలోని పెద్ద విగ్రహాలను వాహనాల్లోకి ఎక్కించడానికి నాలుగు భారీ క్రేన్లు వినియోగిస్తున్నారు. పెద్ద గడియారం సెంటర్, డీఈఓ ఆఫీస్ సర్కిల్, ఎన్జీ కాలేజీ జంక్షన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్ వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు.
శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు
ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్
నల్లగొండ: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు 950 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన ప్రదేశంలో విధులు నిర్వర్తించాలన్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మసీదులు, దర్గాలు, చర్చీల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఊరేగింపులో డీజేలకు అనుమతిలేదని, ఎవరైనా డీజేలు వినియోగిస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఫ పాతబస్తీలోని ఒకటవ నంబర్ విగ్రహం నుంచి శోభాయాత్ర ప్రారంభం