
అన్ని రకాల వైద్యసేవలు అందించాలి
నల్లగొండ టూటౌన్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మాన్యంచల్క పట్టణ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీ, ఏఎన్‌సీ, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. టెస్టులు, ఇతర రిజిస్ట్రర్లను తనిఖీ చేసి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ పనులు పూర్తయినందున ఇతర అంతర్గత పనులు త్వరగా చేపట్టి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఆమె వెంట డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా క్షయనియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.