
విధులకు వెళ్లకుండా ఫేక్ అటెండెన్స్!
నల్లగొండ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ వ్యవహారం నల్లగొండ జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. జిల్లాలో 69 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు హాజరు కాకుండానే అటెండెన్స్ వేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్రస్థాయిలో గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ వారి వివరాలను జిల్లా అధికారులకు పంపించి చర్యలకు ఆదేశించింది. దీంతో ఫేక్ అటెండెన్స్‌కు పాల్పడ్డ కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం.. అందుకు వారు సమాధానం కూడా ఇచ్చారు. త్వరలోనే వారిపై కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఉదయం 9.30 గంటలకు హాజరు వేయాలి
జిల్లాలో పాత గ్రామ పంచాయతీలు 844 ఉన్నాయి. వాటి పరిధిలో పని చేసే పంచాయతీ కార్యదర్శులు రోజూ ఉదయం 9.30 గంటలకు ఆయా గ్రామాలకు వెళ్లి ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో అటెండెన్స్ అప్‌లోడ్ చేయాలి. కానీ.. కొందరు పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మా కొడుతూ ఫేక్ అటెండెన్స్ వేసి పంచాయతీరాజ్ శాఖను మోసం చేస్తున్నారు. ఇలా జిల్లాలో 69 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మారుమూల ప్రాంతాల గ్రామాలకు చెందిన వారే ఉండడం గమనార్హం
యాప్‌లోనే లొసుగులు
ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఫేస్ రికగ్నిషన్ హాజరు కోసం యాప్‌ను రూపొందించి అమలు చేస్తోంది. కానీ ఆ యాప్‌లో పలు లొసుగులు ఉన్నాయి. యాప్‌లో ఉద్యోగి ఆధార్‌కు అనుసందానం లేదు. దానికి తోడు ఎవరి ఫొటో పెట్టినా అటెండెన్స్ పడుతుంది. దీంతో కార్యదర్శులు ఆ గ్రామంలో పనిచేసే కార్మికుల సెల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసి కార్యదర్శుల పాస్ ఫొటోలను వారికి ఇవ్వడంతో వీరు విధులకు వెళ్లని రోజు కార్మికులే వీరి పాస్‌పొటోను చూపి అటెండెన్స్ వేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం
పంచాయతీ కార్యదర్శులు రోజూ ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరువేస్తారు. వారి హాజరును పరిశీలించాల్సింది ఎంపీఓ. సదరు అధికారి రోజూ 2, 3 గ్రామాలు వెళ్లి పరిశీలించాలి. కానీ జిల్లాలో అధికారులు ఫేక్ అటెండెన్స్‌లు గుర్తించలేదు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్‌కు పాల్పడ్డట్లు స్పష్టమవుతోంది.
ఫ 69 మంది కార్యదర్శులను గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ
ఫ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చిన కార్యదర్శులు
ఫ క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్న జిల్లా కలెక్టర్
క్రిమినల్ చర్యలకు అవకాశం..
జిల్లాలో తప్పుడు పద్ధతిలో అటెండెన్స్ వేసిన 69 మంది కార్యదర్శులకు జిల్లా పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు. వాటికి కార్యదర్శులు కూడా సమాధానం ఇచ్చారు. ఆ నివేదిక అంతా కలెక్టర్‌కు సమర్పించనున్నారు. సీసీఎల్‌ఏ నిబంధనల ప్రకారం కార్యదర్శులను సస్పెండ్ చేయవచ్చు. ఇంక్రిమెంట్ కట్ చేయడం, ఇతర క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం కూడా ఉంది. దీనిపై త్వరలోనే కలెక్టర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.