
ఎన్నెస్పీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
త్రిపురారం : భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు వచ్చే అవకాశం ఉంటుందని ఎన్నెస్పీ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ వద్ద కంపాసాగర్ పరిధిలో సాగర్‌ఎడమ కాలువకు ఉన్న ఎమర్జెన్సీ గేట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దదేవులపల్లి చెరువు విస్తీర్ణం, నీటి సామర్థ్యం, ఎమర్జెన్సీ గేట్ల పనితీరుపై ఆరా తీశారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారని తెలసుకున్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎన్నెస్పీ డీఈ గోపీనాథ్, తహసీల్దార్ గాజులు ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఎన్నెస్పీ ఏఈ ప్రవీన్ ఉన్నారు.
ఎడమకాల్వ పరిశీలన
హాలియా : భారీ వర్షాలు వస్తే అత్యవసర సమయంలో అప్రమత్తంగా ఉంటూ సాగునీటిని నియంత్రించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హాలియాలోని 17వ మైలురాయి వద్ద ఎడమకాల్వను పరిశీలించారు. అత్యవసర పరిస్ధితుల్లో నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తక్షణమే నీటిని ఎస్కేప్ ఛానెల్ ద్వారా స్ట్రీమ్‌కు పంపించాలన్నారు.