
విద్యుత్ మోటార్ల చోరీ నిందితుల రిమాండ్
కట్టంగూర్: దొంగిలించిన విద్యుత్ మోటార్లను ట్రాలీ ఆటోలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా కట్టంగూర్ మండల కేంద్రంలో మంగళవారం స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో నల్లగొండ ఏఎస్పీ జి. సురేష్, మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణానికి చెందిన ఎడ్ల సురేష్, నాగిళ్ల ముత్తయ్య, గోపగాని రమేష్, ఆవుల రాజాలు, నాగిళ్ల ఎల్లయ్య కలిసి ఇటీవల కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామ శివారులోని వెంకటేశ్వర డెయిరీ ఫాం వద్ద, అయిటిపాముల గ్రామ శివారులో, శాలిగౌరారం మండల పరిధిలో వ్యవసాయ బావులు, ఫాంహౌజ్‌ల వద్ద విద్యుత్ మోటార్లు, పైపులు చోరీ చేశారు. చోరీ చేసిన విద్యుత్ మోటార్లు, పైపులను ఆటోలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి 14 విద్యుత్ మోటార్లు, 33 బోర్ పైపులు, 8 బ్యాటరీలు, రాగి వైరు, మంచం, రెండు సీలింగ్ ఫ్యాన్లులు, రెండు కుర్చీలు, ఫ్రిజ్, చోరీకి ఉపయోగించిన ట్రాలీ ఆటో, రూ.1,74,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అంతేకాకుండా నిందితుల ఇంటి వద్ద ఉన్న మిగతా వస్తువులను సైతం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్‌తో పాటు ఐదుగురు నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించినట్లు తెలిపారు. ఎడ్ల సురేష్, నాగిళ్ల ముత్తయ్య మూడేళ్ల క్రితం తిప్పర్తి మండల పరిధిలో ఆగి ఉన్న రైలు బోగీ నుంచి 39 బ్యాటరీలను చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్ తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఏఎస్పీ అభినందించారు. ఈ విలేకరు సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ కొండర్‌రెడ్డి, ఎస్‌ఐ మునుగోటి రవీదర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.