5 రోజుల్లోనే లక్ష ఎకరాల్లో.. | - | Sakshi
Sakshi News home page

5 రోజుల్లోనే లక్ష ఎకరాల్లో..

Aug 5 2025 6:15 AM | Updated on Aug 5 2025 6:15 AM

5 రోజ

5 రోజుల్లోనే లక్ష ఎకరాల్లో..

ముమ్మరంగా వరి నాట్లు

ఐదు రోజుల క్రితం 1.25 లక్షల ఎకరాల్లోనే సాగు

కాల్వలకు నీటిని విడుదల చేయడంతో ఇప్పుడు 2.25 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి

నెలాఖరు వరకు మరో 3లక్షల ఎకరాల్లో సాగు కానున్న వరి

సాగు అంచనా ఇలా..

జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో మొత్తం 11.60 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో పత్తి 5,47,735 ఎకరాలు, వరి 5,25,350 ఎకరాల్లో సాగు కానున్నట్లు అంచనా వేశారు. ఇప్పటివరకు పత్తి 5,42,641ఎకరాల్లో, వరి 2,25,284 ఎకరాల్లో, కంది 1,541, మినుము 16, పెసర 166, ఎకరాల్లో ఇతర పంటలు కలిపి ఇప్పటివరకు 7,69,073 రైతులు సాగు చేశారు. వరి సాగు ఇంకా మూడు లక్షల ఎకరాల్లో పెరిగే అవకాశం ఉంది.

నల్లగొండ అగ్రికల్చర్‌ : వానాకాలం వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐదు రోజుల క్రితం వరకు కేవలం 1.25 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేసుకున్నారు. నాగార్జునసాగర్‌ ఎడమకాల్వకు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువకు, వరద కాలువకు, మూసీ కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో వరినాటు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే రైతులు లక్ష ఎకరాల్లో నాట్లు వేసుకోవడం విశేషం. ఇప్పటివరకు రెండు 2,25,254 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరు వరకు మరో మూడు లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసుకోనున్నారు.

నాన్‌ ఆయకట్టులో 90 శాతం పూర్తి..

జిల్లాలోని నాన్‌ ఆయకట్టు మండలాల్లో ఇప్పటికే 90 శాతం వరకు వరినట్లు పూర్తికాగా ఆయకట్టు ప్రాంతంలో 30 శాతం మాత్రమే రైతులు వరినాట్లు వేసుకున్నారు. ఈ సారి ఆయకట్టు ప్రాంతంలో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. సాగునీరు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సారి అంచనాకు నుంచి వరి సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంటోంది.

రైతులను వేధిస్తున్న కూలీల కొరత..

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వానాకాలం సీజన్లో వరినాట్లకు కూలీలు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చత్తీస్‌గడ్‌, ఒడిశా, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన మగ కూలీలతో రైతులు వరినాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు రూ.4 వేల నుంచి 5 వేల వరకు కూలీ చెల్లించాల్సి వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు యాంత్రికరణ పద్ధతిన సాగు చేసుకుని ఖర్చు తగ్గించుకుంటున్నారు.

అధికారుల సూచనలు పాటించాలి

ఆయకట్టుకు సాగునీరు విడుదలవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు 3.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేసుకునే అవకాశం ఉంది. రైతులు ఇప్పటికే వరి నార్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. కూలీల కొరతను అధిగమించేందుకు వెదజల్లే, డ్రమ్‌ సీడర్‌, యంత్రాలు సాగు పద్ధతులను ఎంచుకోవాలి. వ్యవసాయ అధికారులు సూచనలు పాటించాలి.

– పాల్వాయి శ్రవణ్‌కుమార్‌, డీఏఓ

5 రోజుల్లోనే లక్ష ఎకరాల్లో..1
1/1

5 రోజుల్లోనే లక్ష ఎకరాల్లో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement