
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ కోర్సుల్లో చేరేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్. నరసింహరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా కోర్సులో చేరడానికి ఆసక్తి కలగి.. ప్రవేశపరీక్ష రాసి సీటు పొందని వారు, ప్రవేశపరీక్ష రాయకుండా డైరెక్ట్‌గా చేరాలనుకునే విద్యార్థులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాను 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కళాశాల కార్యాలయంలో స్వీకరించి, సంబంధిత ధ్రువపత్రాలను జతపరిచి సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఆగస్టు 8వ తేదీన 10 గంటల నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
13న రైతు పోరాట యాత్ర
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భారత్ కిసాన్ సభ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన రైతు పోరాట యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉజ్జిని యాదగిరిరావు అన్నారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన రైతు సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. జిల్లాలో యూరియా, ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మోయినోద్దీన్, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, బిల్లా కనకయ్య, రంగారెడ్డి, బండమీద వెంకన్న, బొర్ర శేకర్, దోటి పాండరి, వెంకట్‌రెడ్డి, శాంత, బండమీద యాదయ్య, అంజల్‌రావు, పాండు, దేవేందర్, కాంతారావు, శ్రీశైలం పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది : చిరుమర్తి
నార్కట్‌పల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పత్రిక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్‌పై శ్రద్ధ పెట్టారని మండిపడ్డారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన సీఎం రేవంత్‌రెడ్డి దాసోహమై నీటిని ఆంధ్రా ప్రాంతానికి తరలిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చెరువులన్నీ నీటితో కళకళలాడేవని.. ఇప్పుడు మట్టిని అమ్ముకునేందుకు చెరువులను ఎండబెడుతున్నారని మండిపడ్డారు.
గొర్రెల పంపిణీలో
అవకతవకలపై విచారణ
నల్లగొండ టౌన్ : గత ప్రబుత్వ హయాంలో రాయితీ గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై నల్లగొండలో సోమవారం నుంచి విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పశువుల ఆస్పత్రుల్లో వెటర్నరీ డాక్టర్లను కలువడంతో పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. జిల్లాలో తొలి విడతలో 28,236, రెండో విడతలో 5,696 యూనిట్లు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, గొర్రెల మందలేనివారు, గొర్రెలకు బదులు డబ్బులు తీసుకున్నట్లు, గొర్రెలు పంపిణీ చేయకుండా కేవలం ఫొటోలు ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే గొర్రెలు తెచ్చిన వాహనాల నంబర్లు, రికార్డుల్లోని వాహనాల నంబర్లక సరిపోలక పోవడం గమనార్హం. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. రెండు విడతలుగా పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించిన రికార్డులను గత సంవత్సరం రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు తీసుకెళ్లిన విషయం విదితమే.

పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు