
సమస్యలపై ప్రజా ఉద్యమాలు
నల్లగొండ టౌన్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భవిష్యత్‌లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం నల్లగొండలో జరిగిన ఆ పార్టీ జిల్లా విస్త్రత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ఉద్యమించాలన్నారు. ఈ నెల 6 నుంచి15 వరకు సమస్యలపై సర్వేలు, అధ్యయన బృందాలతో పర్యటనలు, ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సంతకాల సేకరణ, 20 నుంచి 30వ తేదీ వరకు అధికారులకు వినతులు, గ్రామ పంచాయతీల వద్ద ధర్నాలు చేయాలన్నారు. సెప్టెంబరు 1నుంచి తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. బీజేపీ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి చైతన్యం చేయాలన్నారు. మోదీ ప్రభుత్వం తమకు ఓటు వేయని ముస్లిం మైనార్టీల పౌర సత్వాలను రద్దు చేసేందుకు దొడ్డిదారిన ఓట్లు తొలగిస్తోందని ఆరోపించారు. బిహార్ ఎన్నికల వేళ 65 లక్షల ఓట్లను తొలగించారని, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించాల్సిన ధైర్యం మోదీకి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాళేశ్వరం, బనకచర్ల పేరిట ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు చేసి పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, శ్రీశైలం, లక్ష్మీనారాయణ, సయ్యద్ హశం, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం