నందికొండ.. నిండుకుండ | - | Sakshi
Sakshi News home page

నందికొండ.. నిండుకుండ

Jul 29 2025 4:35 AM | Updated on Jul 29 2025 9:07 AM

నందిక

నందికొండ.. నిండుకుండ

పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో సాగర్‌ జలాశయం.. నేడు గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. సాగర్‌ గరిష్ట స్థాయి నీటిమట్టం590 అడుగులు (312.0450టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 585.00అడుగుల (297.7235 టీఎంసీలు)కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మంగళవారం క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇందు కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నాగార్జునసాగర్‌ రానున్నారు. మంత్రుల పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బీసీ గురుకుల మైదానంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో మంత్రులు కృష్ణమ్మకు వాయినమిచ్చి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. 18 సంవత్సరాల తర్వాత ఈసారి జూలై మాసంలోనే క్రస్ట్‌ గేట్లు తెరుచుకుంటున్నాయి.

శ్రీశైలానికి భారీగా వరద

ఈ ఏడాది కృష్ణా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు మందుస్తుగానే జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు గల జలాశయాలు గరిష్టస్థాయి నీటిమట్టాలకు చేరాయి. అదనంగా వచ్చే వరదను శ్రీశైలం మీదుగా నాగార్జునసాగర్‌ జలాశయానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి సోమవారం రాత్రి 2,10,920 క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా, సోమవారం ఉదయం రెండు గేట్ల నుంచి, మధ్యాహ్నం 12గంటలకు మూడు గేట్లు, సాయంత్రం 4 గేట్లు, రాత్రి వరకు మొత్తం ఐదు గేట్లను 10 అడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,35,325 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,904 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. దీంతో నాగార్జునసాగర్‌ జలాశయానికి 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది.

కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..

సాగర్‌ విద్యుదుత్పాదన కేంద్రంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో విద్యుదుత్పాదన చేస్తున్నారు. ఆ నీరంతా టెయిల్‌పాండ్‌ ద్వారా పులిచింతల జలాశయానికి చేరుతోంది. ఇక, నిన్నటి వరకు కుడి కాల్వకు కేవలం 511 క్యూసెక్కుల నీటినే విడుదల చేశారు. మంగళవారం నుంయి ఐదు వేల క్యూసెక్కులకు పెంచారు.

నదిలోకి వెళ్లవద్దు : కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

సాగర్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున మత్స్యకారులు, రైతులు నదితీర ప్రాంతాలకు నదిలోకి వెళ్లవద్దని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నదిలో మోటర్లు ఉంటే వెంటనే తొలగించుకోవాలని, మత్స్యకారులు వలలు, పుట్టీలను ఒడ్డుకు చేర్చుకోవాలని సూచించారు.

వరద కాల్వకు నీటి విడుదల

పెద్దవూర : మండలంలోని పూల్యాతండా సమీపంలోని ఏఎమ్మార్పీ లోలెవల్‌ వరద కాలువకు గ్రావిటీ ద్వారా సోమవారం ఉదయం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఈ వి.వేణు మాట్లాడుతూ 85 కిలోమీటర్ల కాలువ కింద 42 డిస్ట్రిబ్యూటరీలు, 30 చెరువులు ఉన్నట్లు తెలిపారు. చెరువులను నింపి రైతులకు సాగునీటిని అందించనున్నట్లు వెల్లడించారు. మొదట 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు దశలవారీగా సాయంత్రానికి 300 క్యూసెక్కులకు పెంచారు. మంగళవారానికి 600 క్యూసెక్కులకు పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ ఎండీ. ఖదీర్‌ పాల్గొన్నారు.

ఏఎమ్మార్పీ ఆయకట్టుకు కూడా..

పెద్దఅడిశర్లపల్లి : ఏఎమ్మార్పీ డివిజన్‌ –4 పరిధిలో ఉన్న ఆయకట్టుకు సోమవారం ఏఎమ్మార్పీ అధికారులు నీటి విడుదల చేశారు. డి–5 నుంచి డి–18 వరకు ఆయకట్టు అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేశారు. సాగర్‌ వెనుక జలాల నుంచి మూడు అత్యవసర మోటార్ల ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని ఏకేబీఆర్‌కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఉదయ సముద్రానికి 1100 క్యూసెక్కులు, హైదరాబాద్‌కు 520 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథకు 45 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ నాగయ్య తెలిపారు.

సాగర్‌ ఆయకట్టుకు

నేడు నీటి విడుదల

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు మంగళవారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నీటిని విడుదల చేయనున్నారు. మంత్రులు ఉదయం 10గంటల వరకు సాగర్‌కు చేరుకుని 11 గంటలలోపు కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు. గడిచిన 18 సంవత్సరాల్లో జూలై మాసంలో కాల్వలకు నీటిని విడుదల చేసిన సందర్భాలు లేవు. 2006లో జూలై 21, 2007లో జూలై 14న నీటిని విడుదల చేశామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.

10.38లక్షల ఎకరాల ఆయకట్టు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ కింద 10.39లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాలు, కృష్ణాజిల్లా 3,68,536 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6,734 ఎకరాలకు సాగర్‌ నీరు అందనుంది.

2007 తర్వాత ఇప్పుడే..

గడిచిన 18 సంవత్సరాల కాలంలో ఏనాడూ ఇంత ముందస్తుగా సాగర్‌ జలాశయానికి వరద రాలేదు. కేవలం 2007లో ముందస్తుగా వరదలు వచ్చి జలాశయం గరిష్టస్థాయికి చేరడంతో జూలై 14వ తేదీన జలాశయం 587.80 అడుగులకు చేరడంతో క్రస్ట్‌గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తిరిగి ఈ ఏడాది రికార్డు స్తాయిలో వరద వచ్చి చేరడంతో జూలై మాసంలోనే గేట్లు ఎత్తాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఫ ఎగువ నుంచి భారీగా వరద

ఫ నేడు క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్న మంత్రులు

ఫ 18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకుంటున్న క్రస్ట్‌గేట్లు

నందికొండ.. నిండుకుండ1
1/1

నందికొండ.. నిండుకుండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement