
నేడు ఎంజీయూకు విద్యా కమిషన్ బృందం
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మంగళవారం విద్యా కమిషన్ బృందం రానుంది. కమిషన్ చైర్మన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వర్‌రావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, కె.జోష్ణ శివారెడ్డి ఎంజీ యూనివర్సిటీని సందర్శించనున్నారు. వారు ఉదయం 10.30 గంటలకు సెమినార్ హాల్‌కు చేరుకొని విద్యా అంశాలపై చర్చించనున్నారు. యూనివర్సిటీ అధ్యాపకులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, విద్యార్థి సంఘాల నాయకులు, అప్పిలేటేడ్ కళాశాలల యాజమాన్యాలు, టీచింగ్, నాన్‌చీటింగ్ ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలతో విద్యా కమిషన్ బృందం సమావేశం కానుందని ఎంజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అలువాల రవి తెలిపారు.
30న జాబ్‌మేళా
నల్లగొండ : జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పలు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 30న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ నుంచి ఏదేని డిగ్రీ, డిప్లొమా(అగ్రికల్చర్, హార్టికల్చర్) ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు వారి ఒరిజినల్స్, బయోడేటాతో జాబ్‌మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 78934 20435 ఫోన్‌లో సంప్రదించాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
మిర్యాలగూడ : ప్రభుత్వ విద్యాలయాల్లో చదవే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈవో బొల్లారం భిక్షపతి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులకు ఆయా పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం వంటగదిలోని ఆహార సామగ్రిని పరిశీలించి నాణ్యమైన భోజనం, తాగునీరు అందించాలన్నారు. ఫుడ్ పాయిజన్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పార్వతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి
కోర్సుల్లో శిక్షణ
రామగిరి(నల్లగొండ): స్వయం ఉపాధి కోర్సులను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందాలని నల్లగొండ సెట్విన్ శిక్షణ సంస్థ కో ఆర్డినేటర్ ఎం.సరిత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ నల్లగొండలోని శిక్షణ కేంద్రంలో 27 కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కోర్సుల్లో ప్రధానంగా కంపూటర్, బ్యూటీషియన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనంగ్, ప్లంబింగ్, డీటీపీ, ఎలక్ట్రీషియన్, టెక్స్‌టైల్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వయంగా ఉపాధి పొందవచ్చని, జాబ్‌మేళా కూడా నిర్వహిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 97050 41789, 08682 281101 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.