గుర్రంపోడు: వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు వరి నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. వరి విత్తనం, నారు ద్వారా సంక్రమించే తెగుళ్లు, నారుదశలో ఆశించే పురుగులు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి వివరించారు.
నారు మడి తయారీలో..
నారు మడి తయారు చేసేటప్పుడు 2 సెంట్ల నారుమడికి 1 నుంచి 1.5 కిలోల వేప పిండి వేయాలి. నాణ్యమైన విత్తనం ఎంచుకుని విత్తన శుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కార్భండిజమ్‌ను కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. నారుమడులైతే లీటరు నీటికి గ్రాము కార్భండిజమ్ మందును కలిపి ఆ ద్రావణంలో కిలో వరి విత్తనాలు 24 గంటలు నానబెట్టాలి. తర్వాత విత్తనాన్ని మళ్లీ 24 గంటలు మండె కట్టాలి. ఇలా మొలకెత్తిన విత్తనాన్ని నారు మడిలో చల్లుకోవాలి. విత్తిన 10 రోజులకు ఒక సెంటు నారుమడికి కార్బోఫూర్యాన్ 3జీ గుళికలు 160 గ్రాముల చొప్పున వేయాలి. ఒక మిల్లీలీటరు క్లోరోపైరిపాస్ 20ఈసీ మందును లీటరు నీటికి కలిపి ఆ ద్రావణంలో నారు వేర్లు మునిగేటట్లు 3గంటల పాటు ఉంచిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. దీని వల్ల కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, సుడిదోమ వంటి పురుగులను అరికట్టవచ్చు. వరి నాటే ముందు నారు కొనలు తుంచి నాటుకోవడం వల్ల కాండం తొలుచు పురుగు బెడద తగ్గించుకోవచ్చు.
ప్రధాన పొలంలో..
నాట్లు వేసే ముందు కనీసం పది రోజుల ముందు పొలాన్ని 2–3 దఫాలుగా దమ్ము చేయాలి. నారు తీసేటప్పుడు మొక్కల ఆకులు లేతాకు పచ్చగా ఉంటే త్వరగా కొత్త ఆకులు వస్తాయి. కనీసం నాలుగు, ఆరు ఆకులు ఉన్న నారు నాట్లు వేయడానికి వాడాలి. ముదురు నారు నాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. నాటు ౖపైపెగా వేస్తే పిలకలు ఎక్కువగా వస్తాయి. చదరపు మీటరుకు కనీసం 44 మొనలు ఉండేలా చూసుకోవాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలిబాటలు తీయాలి. జింక్ లోపం నివారణకు నాట్లు వేసే ముందు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలొల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి.
వరి నాట్లు వేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి