
విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకోవాలి
నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులు అనారోగ్యం పాలు కాకుండా వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు వారిని సొంత పిల్లలుగా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్లగొండలోని ఉదయాదిత్య భవన్‌లో ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పేస్ రికగ్నేషన్ యాప్‌ను అమలు చేస్తామని తెలిపారు. వార్డెన్ల ఫేస్ రికగ్నెషన్ యాప్‌లో హాజరుకాకపోతే వారి జీతాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు వార్డెన్లు హాస్టల్‌లో ఉండాలని, తప్పనిసరిగా మెనూ పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావద్దన్నారు. ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైతే సంబంధిత అధికారులను ఉద్యోగం నుంచి తొలగిస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, శ్రీదేవి, రమణారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇళ్ల కేటాయింపులో విమర్శలకు తావివ్వొద్దు
మిర్యాలగూడ : ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. గురువారం దామరచర్ల ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఇంటి గ్రౌండింగ్ మొదలుకోని నిర్మాణం పూర్తయ్యేంతవరకు పూర్తి పారదర్శకత ఉండాలన్నారు. నిబంధనలకు లోబడి నిర్మించుకున్న వారికి మాత్రమే బిల్లులు చెల్లింపు ఉంటుందన్నారు. ఆమె వెంట ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్‌కుమార్, డీసీఓ పత్యానాయక్, తహసీల్దార్ జవహర్‌లాల్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి