
అంతటా వర్షం.. ‘మెట్ట’కు జీవం
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన కారణంగా జిల్లా వ్యాప్తంగా ముసురుతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో 21.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మర్రిగూడ మండలంలో 75.4 మిల్లీమీటర్లు, అత్యల్పంగా కట్టంగూర్ మండలంలో 3.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వివిధ మండలాల్లో వాడుపడుతున్న పత్తి, కంది, పెసర పంటలకు జీవం పోసినట్లయ్యింది. ఈ వానాకాలం సీజన్‌లో 6,25,452 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4,32,641 ఎకరాల్లో సాగు చేశారు. అలాగే కంది 15 వేల ఎకరాలకు గాను 541 ఎకరాల్లో, పెసర వెయ్యి ఎకరాలకు గాను కేవలం 10 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. జిల్లాలో కొన్ని మండలాల్లో లోటు, మరికొన్ని మండలాల్లో అతిలోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవని కారణంగా జిల్లాలో చాలా మండలాల్లో సాగుచేసిన మెట్టపంటలైన పత్తి, కంది, పెసర చేలు వాడుబట్టి చనిపోయే స్థితిలో జిల్లా అంతటా ముసురుతో కూడిన మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎరువులు పెట్టుకునేందుకు సిద్ధం
గురువారం మోస్తరు వర్షం కురవడంవతో రైతులు పత్తి, కంది చేలకు ఎరువులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికు గుంటుకలు తోలుకుని, డీఏపీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సిద్ధంగా ఉంచుకున్న రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే వర్షం కురవడంతో చేలకు ఎరువులు పెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.
నత్తనడకన వరినాట్లు
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఇప్పటి వరకు సరైన వర్షం కురవలేదు. దీనికితోడు నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల లేని కారణంగా వరినాట్లు నత్తనడకన సాగుతున్నాయి. కేవలం నాన్‌ఆయకట్టు ప్రాంతంలో మాత్రమే రైతులు ఇప్పటి వరకు కేవలం 34,284 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్నారు. గత వానాకాలం సీజన్‌లో జూలే రెండో వారం వరకు 43,260 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్నారు. అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది 10 వేల ఎకరాలు తక్కువ వరినాట్లు వేశారు. నాన్‌ఆయకట్టులో పెద్దగా నాట్లు పడలేదు. ఆయకట్టులో కొన్నిచోట్ల వరినాట్లు పోసుకుని సిద్ధంగా ఉన్నారు. సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేస్తేనే ఆయకట్టులో వరినాట్లు ఊపందుకోనున్నాయి.
వర్షపాతం వివరాలు
(మిల్లీమీటర్లలో..)
మండలం వర్షపాతం
మర్రిగూడ 75.4
గుండ్లపల్లి 44.6
తిరుమలగిరిసాగర్ 43.1
చింతపల్లి 41.6
మిర్యాలగూడ 34
నిడమనూరు 33.8
చిట్యాల 4.9
నార్కట్‌పల్లి 3.9
కట్టంగూర్ 3.1
శాలిగౌరారం 23.7
నకిరేకల్ 22.2
కేతేపల్లి 4.3
తిప్పర్తి 8.3
నల్లగొండ 19.7
కనగల్ 15.2
మునుగోడు 24.0
చండూరు 8.8
నాంపల్లి 4.4
గుర్రంపోడు 17.3
అనుముల హాలియా 26.1
త్రిపురారం 26.3
మాడుగుపల్లి 11.0
వేములపల్లి 28.9
దామరచర్ల 21.5
అడవిదేవులపల్లి 3.3
పెద్దవూర 26.7
పీఏపల్లి 17.8
నేరెడుగొమ్ము 6.0
కొండమల్లేపల్లి 22.0
దేవరకొండ 21.5
చందంపేట 3.5
గట్టుప్పల్ 28.3
గుడిపల్లి 21.5
ఫ జిల్లాలో 21.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు
ఫ అత్యధికంగా మర్రిగూడలో 75.4 మి.మీ.
ఫ అత్యల్పంగా కట్టంగూర్‌లో 3.1 మి.మీ.
ఫ వాడుతున్న పత్తి, కంది, పెసర చేలకు ఊతం

అంతటా వర్షం.. ‘మెట్ట’కు జీవం