
పరిషత్ పోరుకు ఇబ్బందే!
నల్లగొండ: జిల్లా పరిషత్ ఎన్నికలకు గెజిటెడ్ అధికారుల కొరత ఇబ్బందిగా మారనుంది. గత ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అటు గ్రామ, ఇటు జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో జిల్లా పరిషత్ అధికారులు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతంలో జెడ్పీటీసీ ఎన్నికలకు ఆర్‌ఓలుగా నియమించిన గెజిటెడ్ ఆఫీసర్లు కొందరు పదవీ విరమణ పొందడంతో ఎన్నికలకు సిబ్బంది కొరత ఏర్పడింది.
వెతుకులాటలో అధికారులు..
గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం.. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతోపాటు ఎన్నికల సిబ్బందిని నియమించింది. అయితే జెడ్పీటీసీ స్థానాల ఎన్నికకు మండల ప్రత్యేక అధికారులనే రిటర్నింగ్ అధికారులుగా నియమించింది. నాలుగు ఎంపీటీసీలకు ఒక ఆర్‌ఓను గెజిటెడ్ హెడ్మాస్టర్లను ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ ఇతర శాఖలకు సంబంధించిన ఇంజనీర్లను, గెజిటెడ్ అధికారులను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. వారికి ఫిబ్రవరిలోనే శిక్షణ కూడా ఇచ్చారు. ప్రస్తుతం చందంపేట, మరికొన్ని మండలాల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఎంఈఓలు రిటైర్ అయ్యారు. వారి స్థానంలో తిరిగి గెజిటెడ్ అధికారులను నియమించేందుకు ఆ స్థాయిలో ఇన్‌చార్జ్‌లను వెతుకుతున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎంపిక చేసిన ఆర్‌ఓ అధికారులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వినియోగించకపోవడం వల్ల గెజిటెడ్ అధికారుల కొరత నెలకొంది.
ఒక్క జిల్లాలోనే అవసరానికి మించి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు మొత్తం 24,888 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 22,257 మంది మాత్రమే ఉన్నారు. అయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అవసరానికి మించి బ్యాలెట్ బాక్స్‌లు ఉన్నాయి. అలాగే ఒక్క సూర్యాపేట జిల్లాలో మాత్రమే ఎన్నికల సిబ్బంది అవసరానికి మించి ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా
నల్లగొండ సూర్యాపేట యాదాద్రి
జెడ్పీటీసీలు 33 23 17
ఎంపీటీసీలు 353 235 178
పోలింగ్‌కేంద్రాలు 1,925 1,273 994
కావాల్సిన బ్యాలెట్‌బాక్స్‌లు 2,406 1,592 1,934
ప్రస్తుతం ఉన్న బాక్స్‌లు 5,876 1,842 1,650
అవసరమున్న సిబ్బంది 11,550 6,616 6,719
ప్రస్తుతం ఉన్నది 9,588 6994 5,677
ఫ వేధిస్తోన్న గెజిటెడ్ అధికారుల కొరత
ఫ గతంలో శిక్షణ పొందినవారిలో రిటైరైన కొందరు
ఫ కొత్త వారిని వెతుకుతున్న యంత్రాంగం
ఫ ఉమ్మడి జిల్లాలో అవసరమున్న సిబ్బంది 24,888 మంది
ఫ ప్రస్తుతం ఉన్నది 22,257 మంది మాత్రమే..
రెండు విడతల్లో ఎన్నికలైతే.. సరిపోతారు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహిస్తే పోలింగ్ సిబ్బంది కొరత ఉండదు. మొదటి విడత ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది రెండో విడతకు కూడా కొందర్ని ఉపయోగించవచ్చు. ఎన్నికలకు సంబంధిచి ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణ పూర్తయింది. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉన్నాయి.
– శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ, నల్లగొండ

పరిషత్ పోరుకు ఇబ్బందే!