
ఒక్కో నీటిచుక్క ఎంతో విలువైనది
ఫ ఈఎన్‌సీ శ్రీనివాస్
నాగార్జునసాగర్ : వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి యాజమాన్యానికి చక్కటి ప్రణా ళిక అవసరమని.. ఒక్కో నీటిచుక్క విలువైనదని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీనివాస్ అన్నారు. సాగర్ ఆయకట్టు పరిధిలో కొనసాగుతున్న కాల్వల మరమ్మతు, ప్రాజెక్టులో పనులపై గురువారం హిల్‌కాలనీలోని విజయవిహార్ సమావేశ మందిరంలో నల్లగొండ చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్‌తో కలిసి సమీక్షించారు. అంతకుముందు సాగర్ ప్రధాన డ్యాంతోపాటు గ్యాలరీలు, గేట్లు, స్పిల్‌వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిధుల వినియోగం, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏ క్షణాన ఆదేశాలు వచ్చినా కాల్వలకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.. అందుకు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్యాం ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లికార్జున్, ఇంజనీర్లు పాల్గొన్నారు.