
దరఖాస్తు గడువు పొడిగింపు
నల్లగొండ : జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు –2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించినట్లు డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు nationalawardstoteachers.ed ucation.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 17లోగా రిజిస్ట్రేషన్, 20లోగా ఫైనల్ సబ్‌మిషన్ చేయాలని పేర్కొన్నారు. పైనల్ సబ్‌మిషన్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తగిన ఆధారాలు జతపరిచి వారి ఫొటోలు, వీడియో పెన్‌డ్రైవ్‌లో వేసి మూడు ప్రతులు ఎంఈఓ ద్వారా డీఈవో కార్యాలయంలో ఈ నెల 22లోగా సమర్పించాలని సూచించారు.
భూ సర్వేకు రైతులు సహకరించాలి
చందంపేట : భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో నిర్వహిస్తున్న భూ సర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. బుధవారం చందంపేట మండలంలోని అచ్చంపేటపట్టి గ్రామంలో నిర్వహించిన భూ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఆర్జీలు పెట్టుకున్న రైతులకు సంబంధించి వ్యవసాయ భూములను క్షేత్రస్థాయిలో సర్వేయర్ల బృందం సర్వే నిర్వహిస్తుందని, సర్వే సమయంలో రైతులు అందుబాటులో ఉండాలన్నారు. త్వరలోనే బొల్లారం, కంబాలపల్లి, పొగిళ్ల, రేకులగడ్డ, చిత్రియాల గ్రామాల్లో సర్వే నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీధర్‌బాబు, ఆర్‌ఐ సురేష్, హబీబ్, అనిల్ ఉన్నారు.
ఆదర్శ హాస్టల్ తనిఖీ
మర్రిగూడ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల హాస్టల్‌ను డీఈఓ భిక్షపతి బుధవారం తనిఖీ చేశారు. హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌తో సోమవారం 18 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా సిబ్బంది వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఈ విషయంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి సైతం హాస్టల్‌ను తనిఖీ చేసి వంట సామగ్రిని పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ జి.చినమునయ్య, ఎస్‌ఓ జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
అమృత్ పనులు
త్వరగా పూర్తి చేయాలి
నల్లగొండ టూటౌన్ : అమృత్ పథకం ద్వారా చేపడుతున్న తాగునీటి ట్యాంక్ పనులు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ కార్యాలయ డిప్యూటీ డైరెక్టర్ పి.శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నీలగిరి పట్టణంలో అమృత్ స్కీం ద్వారా చేపడుతున్న తాగునీటి ట్యాంకుల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పనుల్లో నాణ్యత ఉండేలా ప్రజారోగ్య శాఖ మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, ప్రజారోగ్య శాఖ ఈఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈఈ మనోహర్, ఏఈ నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తు గడువు పొడిగింపు

దరఖాస్తు గడువు పొడిగింపు