
లీజు పూర్తి.. గుంతలు అసంపూర్తి!
మిర్యాలగూడ : దామరచర్లలోని నార్కట్‌పల్లి– అద్దంకి రహదారి వెంట ఓ సిమెంట్స్ పరిశ్రమయాజమాన్యం మైనింగ్ నిర్వహించిన ప్రాంతంలో గుంతలు పూడ్చకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. సదరు పరిశ్రమ రహదారికి వంద అడుగుల దూరంలో వాడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ, ప్రభుత్వ భూముల్లో నాపరాయి తవ్వకాల కోసం 35 ఏండ్ల క్రితం లీజుకు తీసుకుని.. 25 ఏళ్లపాటు తవ్వకాలు జరిపి మైనింగ్ నిర్వహించింది. 8 సంవత్సరాల క్రితం లీజు గడువు పూర్తికాగా మైనింగ్ నిలిపివేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనుల ప్రదేశాలను మట్టితో పూడ్చి చెట్లను నాటి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కానీ గుంతలను అలాగే వదిలేయడంతో ప్రస్తుతం అవి ప్రమాదకరంగా మారాయి. సుమారు వంద అడుగుల లోతు వరకు గోతులు ఉండడంతో వాటిలో నీరు చేరాయి. పశువులు, మూగ జీవాలు అందులోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నాయి. హైవే పక్కన గుంతలు ఉండడంతో అవి కనిపించకుండా చుట్టూ నాపరాయి గోడను నిర్మించారు. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేయగా అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
పూడ్చకుండా వదిలేసిన గుంతలు