
ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలి
మిర్యాలగూడ : వానాకాలం సీజన్ ప్రారంభమైనందున సాగర్ ఎడమకాల్వ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయకట్టు పరిధిలో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటికే దుక్కులు దున్ని, నార్లు పోసుకుని.. నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు, కాల్వలు ఎండిపోయి ఉన్నాయని, నీటి విడుదల చేసి చెరువులు, కుంటలు, కాల్వలు ఎండిపోయి ఉన్నాయని, నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని దీనివల్ల భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. నీటి విడుదలపై తక్షణమే స్పష్టమైన ప్రకటక చేయాలని, షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్, తిరుపతి రామ్మూర్తి, అప్పారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే జూలకంటి