
నిర్వహణ వ్యయాన్ని తగ్గించాలి
నాగార్జునసాగర్: భవిష్యత్‌లో విద్యుత్ ఉత్పత్తి నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేలా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం తెలంగాణ జెన్‌కో సీఎండీ హరీష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డిలతో కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. జలవిద్యుత్ కేంద్రంలోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు, పవర్ హౌజ్‌ను పరిశీలించిన అనంతరం జెన్‌కో పవర్ పవర్ హౌజ్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షించారు. భవిష్యత్‌లో జల విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పంపులను సోలార్‌పై నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. జలవిద్యుత్ కేంద్రం ద్వారా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం విద్యుత్ ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జల విద్యుత్ కేంద్రం సీఈ మంగేష్‌కుమార్ నాగార్జునసాగర్ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం వివరాలు తెలిపారు. అనంతరం విజయ్ విహార్ నుంచి సాగర్ జలాశయం అందాలను తిలకించారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్న మొదటి టర్బైన్ పనులు, అంతర్భాగంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. అక్కడినుంచి కంట్రోల్ రూంకు చేరుకుని అక్కడ విద్యుత్ అధికారులతో విద్యుత్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎస్‌ఈ రఘురాం, సాగర్ సీఐ శ్రీనునాయక్, జెన్‌కో సీఐ నాయుడు, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్‌ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ ముత్తయ్య ఉన్నారు.