
ప్రమోషన్లలో బీసీలకు అన్యాయం
నల్లగొండ : తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి అన్నారు. గురువారం నల్లగొండలోని విద్యుత్ శాఖ అతిథి గృహంలో జరిగిన తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన ప్రమోషన్లను సమీక్షించాలన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా విద్యుత్ సంస్థల్లో అమలు చేయలేదన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా విద్యుత్ సంస్థల్లో అడ్‌హక్ పేరుతో ప్రమోషన్లు ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇది తప్పు అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అడ్ హాక్ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. సుప్రీం, హైకోర్టు తీర్పులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే ప్రమోషన్లను సమీక్షించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గంజి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మేందర్ రావు, ట్రాన్స్‌కో అధ్యక్షుడు అశోక్ కుమార్, మారం శ్రీనివాస్, పి.యాదగిరి, పి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.