
3 నెలల్లో 43.63 లక్షల పనిదినాలు
నల్లగొండ : ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు కేటాయించిన పనిదినాలను కూలీలు మూడు నెలల్లోనే పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఉపాధి కూలీలకు 38.10 లక్షల పని దినాలను టార్గెట్ నిర్ణయించింది. కానీ.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల్లోనే 43.63 లక్షల పని దినాలను కూలీలు పూర్తి చేశారు. అంటే లక్ష్యాన్ని మించి 5.53 లక్షల పనిదినాలను అధికంగా చేపట్టారు. రూ.126.94 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.122.84 కోట్ల పనులు పూర్తి చేశారు. 133 కుటుంబాలకు వంద రోజుల పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం ప్రకారం కూలీలకు డబ్బుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికంగా చేసిన పని దినాలకు చెల్లింపుల కోసం అధికారులు ప్రతిపాదనలు పెట్టారు.
కూలి కూడా అధికంగానే గిట్టుబాటు..
వాస్తవంగా ప్రభుత్వం కూలీలకు రోజుకు రూ.307 కూలి చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరంలో రోజుకు రూ.197 మాత్రమే చెల్లించారు. ఈ సంవత్సరం కూలీలకు రూ.276.13 చొప్పున గిట్టుబాటు అయ్యింది.
పని దినాల పొడిగింపుపై రాని స్పష్టత..
ఉపాధి హామీలో ఈ సారి ప్రభుత్వం పని దినాలను కుదించింది. దీంతో మూడు నెలల్లో పూర్తయ్యాయి. పని దినాల పొడిగింపుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాష్ట్ర కోటా 6.5 కోట్ల పనిదినాలు ఉండగా.. ఇప్పటి వరకు 5 కోట్ల పైచిలుకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా ఏ జిల్లాల్లో లక్ష్యానికి మించి పూర్తిచేశారో.. ఆ ప్రాంతాలకు ఆ పని దినాలను పెంచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. డిసెంబర్, జనవరి ఆ తర్వాతనే కూలీలు మళ్లీ పనులకు వస్తారు. అయితే ఆర్థిక సంవత్సరం ఇంకా 9 నెలలు ఉంది. కేంద్రం ఈ విషయంలో స్పందించి పని దినాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు చేపట్టే అవకాశం లేదు.
లక్ష్యం మించిన ‘ఉపాధి’
ఫ సంవత్సరమంతా చేయాల్సిన పనులు త్రైమాసికంలోనే పూర్తి
ఫ 5.53 లక్షల పనిదినాలను అధికంగా చేసిన కూలీలు
పని దినాల పెంపుపై ఆదేశాలు రాలేదు
జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం కేటాయించిన పని దినాల కంటే అధికంగా పని చేశారు. ఇప్పటికే పని దినాలు పూర్తయినందున మళ్లీ పని దినాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటే తిరిగి కూలీలకు పనులు కల్పిస్తాం. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.
–శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ

3 నెలల్లో 43.63 లక్షల పనిదినాలు