
రేపు ఎంజీయూలో స్క్రాప్ వేలం
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్మాణాల సందర్భంగా పోగుపడిన పాత ఇనుము, చెక్క ఇతర స్క్రాప్‌ను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ అల్వాల రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వ్యాపారులు రూ.2 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9948361250 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
నిబంధనలు పాటించని
ఆర్‌ఎంపీలపై కేసు నమోదు
కొండమల్లేపల్లి: దేవరకొండ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న పలువురు ఆర్‌ఎంపీలపై పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు రాము ఫిర్యాదు మేరకు దేవరకొండ పట్టణంలోని సాయిరాం క్లినిక్ నిర్వాహకుడు రాజేశ్వరరావు, అల్ఫా క్లినిక్ నిర్వాహకుడు జహంగీర్, ఆకాశ్ కంటి ఆస్పత్రి నిర్వాహకుడు రమేష్, మారుతీ క్లినిక్ నిర్వాహకుడు సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు దేవరకొండ సీఐ నర్సింహులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
ఆర్థిక ఇబ్బందులతో
కౌలు రైతు ఆత్మహత్య
కనగల్: నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన గోనెల చిన్న యాదయ్య(45) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని సేద్యం చేయటంతో పాటు కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటం కుటుంబ ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. భార్య కాశమ్మతో తరచూ గొడవలు రావడంతో వారం రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన చిన్న యాదయ్య బుధవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన యాదయ్య తల్లి లింగమ్మకు కొడుకు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని తల్లి లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామయ్య తెలిపారు.