
ఎమ్మార్పీకే ఎరువులు విక్రయించాలి
నల్లగొండ : ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీకి మించి ఎరువులను అమ్మిన డీలర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ‘యూరియా అమ్మకాల నిలిపివేత’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. జిల్లాలో యూరియాతో సహా అన్ని ఎరువులు సరిపోయినంతగా నిల్వలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రోజూ 9000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు నెలకు అవసరమైన బఫర్ ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ డీలర్లు ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలని, యూరియాకు ఇతర ఎరువులతో లింకు పెట్టవద్దని సూచించారు.
ఎరువుల దుకాణాల తనిఖీ
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎరువుల స్టాక్, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మార్పీ ధరలకే యూరియా విక్రయించాలని, అధిక ధరకు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రవాణా చార్జీల భారం పడుతుందని యూరియా విక్రయాలు బంద్ పెట్టొద్దని సూచించారు. ఈ వానాకాలం సీజన్‌లో 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 8వేల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. మంగళవారం వరకు 22వేల మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీలు, డీలర్లు, ఎన్‌డీసీఎంఎస్ వద్ద అందుబాటులో ఉందని, 10వేల మెట్రిక్ టన్నులు మార్క్‌ఫెడ్ గోదాములో నిల్వ ఉందన్నారు. వెయ్యి టన్నుల యూరియా కంపెనీ వద్ద నిల్వ చేసుకున్నారని తెలిపారు. ఆయన వెంట ఇన్‌చార్జి ఏడీఏ సైదానాయక్, జవహర్‌బాబు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి