
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
మిర్యాలగూడ : కార్మికుల హక్కుల సాధనకు ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మార్కెండేయ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సీఐటీయూ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల సమస్యలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. కొత్త చట్టాల వల్ల కార్మికులకు కనీస వేతనం అందదని, శ్రమకు తగ్గ వేతనం రాదని, శ్రమ దోపిడీకి గురవుతారని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఈనెల 5న అన్ని మండల కేంద్రాల్లో మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించాలని, 9వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలపాలన్నారు. 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, తిరుపతి రామ్మూర్తి, బావండ్ల పాండు, రవినాయక్, రొండి శ్రీనివాస్, దయానంద్, కేశవులు, పార్వతి, సైదులు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి