
ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి!
నల్లగొండ అగ్రికల్చర్ : వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది 6వ తేదీన ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 5.60 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగిన రైతులు ఉండగా.. ఇప్పటి వరకు లక్షా 80 వేల మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రిజిస్ట్రి ప్రకియ ప్రారంభించి రెండు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు సగం మంది రైతులు కూడా నమోదు చేయించుకోలేదు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు ప్రభుత్వం ఒక విశిష్ట సంఖ్య కేటాయించి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ గుర్తింపు కార్డులో 11 అంకెల యూనిక్ ఐడీ కేటాయించనున్నారు. భవిష్యత్‌లో ఈ గుర్తింపు కార్డు ద్వారానే రైతులకు పథకాలు వర్తించేలా కేంద్ర ప్రభుత్వం చూడనుంది. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన రైతులకు వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
కేంద్ర పథకాలకు
యూనిక్ నంబర్ తప్పనిసరి..
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి, సాయిల్ హెల్త్‌కార్డు, పసల్ బీమా తదితర పథకాలు వర్తించాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. భవిష్యత్‌లో ఎరువుల పంపిణీ కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే ఉండనుంది. కొత్తగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రైతుల ఖాతాలో జమ కావాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకాలకే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటున్నా.. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉండాలనే నిబంధన వచ్చే అవకాశం ఉంది.
పార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రయోజనాలు..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంతో రైతులకు 11 అంకెల యూనిక్ ఐడీ కార్డు వస్తుంది. దీంతో రైతుల భూముల వివరాలతో పాటు నేల స్వభావం, సర్వే నంబర్లు, సాగు చేస్తున్న పంటల వివరాలు, రైతులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. వివరాలన్నీ ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తుండటంతో ఒక్క క్లిక్‌తో రైతుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో రైతుల వివరాలు ఎంటర్ చేయగానే పంటలకు సంబంధించి వివరాలు తెలుస్తాయి. ఈ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం పథకాలు అందేలా చేస్తుంది.
ఫ జిల్లాలో 5.60 లక్షల మంది రైతులకు.. 1.80 లక్షల మంది నమోదు
ఫ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంటేనే కేంద్ర ప్రభుత్వ పథకాలు
ఫ అవగాహన లేక రిజిస్ట్రేషన్‌చేయించుకోని రైతులు
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇలా..
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత ఏఈఓ, ఏఓకు వివరాలు సమర్పించాలి. ఇందుకోసం రైతులు తమ ఆధార్‌కార్డుతో పాటు ఆధార్‌కార్డుకు లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను తీసుకెళ్లాలి. రైతుల వివరాలు నమోదు చేసేటప్పుడు ఫోన్‌కు మూడు సార్లు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీ కార్డు వస్తుంది.
ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ప్రభుత్వాలు అమలు చేసే పథకాలకు ఫార్మర్ యూనిక్ ఐడీ కార్డు తప్పనిసరి. రైతులు వెంటనే తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు మండల వ్యవసాయాధికారిని కలిసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
– శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి

ఫార్మర్ రిజిస్ట్రీపై అనాసక్తి!