
రైతు ప్రయోజనాలే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తృతం చేశామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడతున్నామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025–26)రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు వారికి బ్యాంకు ద్వారా ఇచ్చే రుణ పరిమితిని పెంచినట్లు వివరించారు. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 1917లో ప్రారంభమైన డీసీసీబీ 107 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉమ్మడి జిల్లాలో 108 సహకార సంఘాల ద్వారా రైతులకు వివిధ రకాల సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఆధ్వర్యంలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే..
రైతులకు డ్రోన్ల సహకారం
రైతులకు బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేయబోతున్నాం. డ్రోన్లను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. బ్యాంకు పరిధిలోని 108 సహకార సంఘాల్లో డ్రోన్లను అందుబాటులోకి తెస్తాం. వాటిని ఈ వానాకాలం సీజన్‌లోనే అందజేస్తాం. బయటి మార్కెట్ కంటే తక్కువ ఖర్చుతో రైతులు వరి, పత్తి చేలకు పురుగు మందులను పిచికారి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు రూపొందించాం
పెద్ద ఎత్తున రుణ సదుపాయం,
జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.1100 కోట్లు
గతేడాది కంటే రూ.483 కోట్ల అదనపు రుణాలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి
మరో 6 కొత్త శాఖలు
ఉమ్మడి జిల్లాలోని తిప్పర్తి, ఆత్మకూర్, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో కొత్త శాఖల ఏర్పాటుకు ఇప్పటికే ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. వాటిని త్వరలో ప్రారంభిస్తాం. ఈ ఆర్ధిక సంవత్సరంలో మరో 6 కొత్త శాఖల ఏర్పాటుకు ఆర్‌బీఐకి ప్రతిపాదనలను పంపించాం. మిర్యాలగూడ, శాలిగౌరారం, పెద్దవూర, మోతె, చిలుకూరు, నాంపల్లిలో వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.

రైతు ప్రయోజనాలే లక్ష్యం