
అమ్మ పేరుతో ఒక మొక్క!
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మహిళా సంఘాల భాగస్వామ్యంతో చర్యలు చేపట్టింది. ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా ఉమెన్స్ ఫర్ ట్రీస్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అమృత్ 2.0 స్కీం కింద ‘ఏక్ ఫేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) అనే నినాదంతో మహిళా సంఘాల సభ్యులు మొక్కను నాటడంతో పాటు రెండేళ్ల పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా వారే చూసేలా కార్యాచరణ రూపొందించింది.
రెండు ప్రాంతాలు గుర్తింపు..
‘అమ్మ పేరుతో ఒక మొక్క’ అనే నినాదంతో చేపట్టిన వన మహోత్సవం విజయవంతానికి మున్సిపల్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా చెరువుల సమీపాల్లో మొక్కలను నాటనున్నందున పట్టణానికి అనువైన స్థలాలుగా యాద్గార్‌పల్లి పందిర్లపల్లి చెరువు(బోటింగ్ పార్క్), హౌజింగ్ బోర్డు చిన్న చెరువులను గుర్తించారు. చెరువుల వద్ద మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగిస్తారు.
జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభం..
మున్సిపాలిటీలో గుర్తించిన రెండు ప్రాంతాల్లో జూన్ 5వ తేదీ నుంచి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులు మొక్కలు నాటనున్నారు.
ఫ వన మహోత్సవంలో మహిళా సంఘాల భాగస్వామ్యం
ఫ మొక్క నాటి సంరక్షించే బాధ్యత
మహిళలకు అప్పగింత
ఫ మిర్యాలగూడ మున్సిపాలిటీలో వినూత్న కార్యక్రమం
ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం
మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మహ్మద్ యూసుఫ్ మహిళా సంఘాలకు సూచిస్తున్నారు. మున్సిపాలిటీలో మొక్కలను నాటేందుకు గుర్తించిన స్థలాల్లో మహిళలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.