
సాగు పనుల్లో రైతన్న బిజీ
ఫ వర్షంతో ఊపందుకున్న దున్నకాలు
ఫ విత్తనాలు సిద్ధం చేసిన వ్యవసాయ అధికారులు
ఫ 11.60 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
నల్లగొండ అగ్రికల్చర్: తొలకరి వర్షాలు ముందే కురుస్తుండడతో జిల్లా అంతటా రైతులు దుక్కులను దున్నుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతులు పత్తిచేలలో కట్టెను తొలగించుకుని సిద్ధంగా ఉండడంతో పత్తి సాగుకు అవసరమైన దుక్కులను దున్నుకుంటున్నారు. వరి, పత్తి విత్తనాల కొనుగోలు కోసం రైతులు పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్ గత వానాకాలం సీజన్ కంటే వారం ముందుగా ప్రారంభం కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది. ఆదివారం రోహిణి కార్తె ప్రారంభం కాగా.. జూన్ 8న మృగశిర కార్తె ప్రారంభం కానుంది. అదేవిధంగా జూన్ 11న ఏరువాక పౌర్ణమి కావడంతో రైతులు ఆ రోజు ఏరువాక ప్రారంభించనున్నారు.
పెట్టుబడుల కోసం తిప్పలు..
ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో పంటల సాగుకు రైతులకు పెట్టుబడి కష్టాలు తప్పేలా లేవు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నాలుగు ఎకరాలపై భూమి ఉన్న రైతులకు నేటివరకు అందని పరిస్థితి. ప్రస్తుతం వానాకాలం సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్‌కు జూన్ మొదటి వారంలోనే గత ప్రభుత్వం పెట్టుబడి సాయం రైతు బంధు పేరుతో అందించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వానాకాలం రైతు భరోసాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో రైతుభరోసా వస్తుందో రాదో అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. గత యాసంగి సీజన్‌లో కూడా రైతులందరికీ రైతు భరోసా అందలేదు. వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
అందుబాటులో విత్తనాలు..
రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలను సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా 13 లక్షల 80 వేల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం ఉందని గుర్తించి దానికి అనుగుణంగా జిల్లాలోని విత్తన డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. అదేవిధంగా లక్ష క్వింటాళ్ల వరి విత్తనాలను కూడా డీలర్ల వద్ద అందుబాటులో ఉంచింది. కంది, పెసర, వేరుశనగ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యాబై శాతం సబ్సిడీపై అందించే పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలను జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాలు, గ్రోమోర్ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.
పత్తి సాగు వైపే మొగ్గు..
వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 11లక్షల 60 వేల ఎకరాల్లో వరి, పత్తి ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో సింహభాగంగా పత్తి 5,47,735 ఎకరాల్లో, వరి 5,25,350 ఎకరాల్లో, మిగతా కంది, పెసర, వేరుశనగ, సజ్జ, జొన్న పంటలు సాగు కానున్నాయి.
దుక్కులు దున్నుకుంటున్నారు
నైరుతి రుతుపనాలు మూడు రోజుల ముందే రావడం మంచి పరిణామం. ఇప్పటికే జిల్లా అంతటా రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. వానాకాలం సీజన్ జూన్ నుంచే ప్రారంభమవుతుంది. రుతుపవనాల కారణంగా కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలను పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.
–పాల్వాయి శ్రవణ్‌కుమార్, జేడీఏ

సాగు పనుల్లో రైతన్న బిజీ

సాగు పనుల్లో రైతన్న బిజీ

సాగు పనుల్లో రైతన్న బిజీ