
ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
వేములపల్లి: ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించి కూలీలతో మాట్లాడారు. గతంలో ఉపాధి హామీ పథకానికి రూ.2లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఇప్పుడు రూ.86 వేల కోట్లకు కేంద్రం కుదించిందన్నారు. అదేవిధంగా గతంలో 23 కోట్ల జాబ్‌కార్డులు ఉంటే ఇప్పుడు 13 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఉపాధి కూలీలకు రూ.500 రోజువారి వేతనంతోపాటు పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వలు, చెరువుల పూడిక తీత పనులు చేపట్టాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి ఎక్కువ నిధులు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లు గౌతంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని, నాయకులు చల్లబొట్ల ప్రణీత్‌రెడ్డి, వడ్డెగాని సైదులు, రెమడాల భిక్షం, సుకన్య తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి