కొనుగోళ్లలో రెండో స్థానం | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో రెండో స్థానం

May 27 2025 1:53 AM | Updated on May 27 2025 1:53 AM

కొనుగ

కొనుగోళ్లలో రెండో స్థానం

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిజామాబాద్‌ జిల్లా నిలిచింది. ఆఖరి స్థానంలో అతి తక్కువ ధాన్యం కొనుగోలు చేసి ఆదిలాబాద్‌ జిల్లా నిలిచింది.

మొదటగా నల్లగొండలో కేంద్రాలు ప్రారంభం

రాష్ట్రంలోనే మొదటగా నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. యాసంగి కోతలు నల్లగొండ జిల్లాలో ముందస్తుగా రావడంతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావి పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. ఆ తర్వాత తిప్పర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదేరోజు మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు.

రెండో స్థానంలో నల్లగొండ..

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 8.16 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నిజామాబాద్‌ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా.. 5.83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కాగా ఆదిలాబాద్‌ 249 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది.

ఇబ్బందులు ఎదుర్కొంటూ..

జిల్లాలో ధాన్యం దిగుబడిని వ్యవసాయ శాఖ అధికారులు సక్రమంగా అంచనా వేయలేకపోయారు. ప్రతిసారి వారు వేసిన అంచనాకు మించి ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. దాంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అధికంగా వస్తోంది. అయితే ఈసారి యాసంగి సీజన్‌ సమయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు రిటైర్డ్‌ కావడంతో డీఎం హరీష్‌కు ఇన్‌చార్జ్‌ డీఎస్‌వో బాధ్యతలు అప్పగించారు. రెండు కీలక పోస్టుల్లోను ఆయనే వ్యవహరించాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మహబూబ్‌నగర్‌ నుంచి వెంకటేశ్వర్లు డీఎస్‌వోగా బదిలీపై వచ్చారు. కొనుగోళ్ల భారం కలెక్టర్‌ మీద వేసుకుని జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఏరోజుకారోజు తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ వచ్చారు. ధాన్యం సంచుల కొరత, లారీల కొరత ఎదురైనప్పటికీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ధాన్యం కొనుగోళ్లు చేశారు. దీంతో నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.

నల్లగొండ జిల్లాలో 5.83 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ఫ జిల్లాలో అంచనాకు మించి దిగుబడి

ఫ సమన్వయంతో పనిచేసిన అధికారులు

సమన్వయంతో పనిచేశాం

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి నిత్యం అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయడంతో కొనుగోళ్లలో ముందు వరుసలో ఉన్నాం. లారీ ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్‌తోపాటు ఇటు మిల్లర్లతో మాట్లాడి ధాన్యం దిగుమతి చేసేలా చర్యలు తీసుకున్నారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు రైతులకు ధాన్యం డబ్బులు విడుదలయ్యాయి. వాటిని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేశాం.

–హరీష్‌, పౌర సరఫరాల శాఖ డీఎం

అంచనాకు మించి కొనుగోళ్లు..

జిల్లాలో మొత్తం 5.36 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు సంబంధించి 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అంచనాకు మించి మొత్తం 5.83 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇచ్చిన టార్గెట్‌ 5.36 లక్షలు అయితే.. 5.83 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. అంటే 47 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశారు. దాదాపు రూ.1350 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 82 వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు.

కొనుగోళ్లలో రెండో స్థానం 1
1/1

కొనుగోళ్లలో రెండో స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement